పవన్ ఇమేజ్‌ను తగ్గిస్తే... ఎవరికి నష్టం?
ఆ తర్వాత సీట్ల విషయంలోనూ పవన్ చాలా మెట్లు కిందికి దిగారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన నెంబర్-2, నెంబర్- 3 కాదంటూ.. కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. పెడుతున్న సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వల్ల ఎవరికి నష్టం ? ఎవరు రేపు బాధపడాలి? అనే చర్చ తెరమీదికి వచ్చింది. ముఖ్యంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్నీ తానై పవన్ వ్యవహరించారు. బీజేపీతో టీడీపీని కలిపేందుకు నానా తిప్పలు పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
ఆ తర్వాత సీట్ల విషయంలోనూ పవన్ చాలా మెట్లు కిందికి దిగారు. ముందు 24 సీట్లు అనుకుని కూడా.. తర్వాత 21కి తగ్గారు. ఇలా.. పొత్తు దర్మాన్నిపాటించడంలో ముందున్నారు. అంతేకాదు.. ఈక్రమంలో కీలక నాయకులు పోతిన మహేష్ వంటివారు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా.. ముద్రగడ పద్మనాభం వంటి వారు.. తీవ్ర విమర్శలు చేసినా పవన్ తట్టుకుని ముందుకు సాగారు. ఇక, కూటమి ప్రచారానికి కూడా ఊపు తెచ్చారు. తనే స్వయంగా ప్రచారం చేశారు.
ఫలితంగా అప్పటి వరకు గెలుపు అంచనాలపై ధీమాతో ఉన్న వైసీపీని ఒక్కసారిగా పవన్ డిఫెన్స్‌లో పడేశారు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీకి ఓటమి తాలూకు బయాన్ని చూపించారు. మరోవైపు.. టీడీపీ, జనసేనలోని యూత్‌ను ఉరకలెత్తించారు. ఫలితంగా.. కూటమి నిలబడేందుకు.. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకుకూడా.. పవన్ ఒకరకంగా.. దోహదకారి అయ్యారు. అలాంటి పవన్‌ను ఇప్పుడు తక్కువ చేసి చూపించేందుకు కూటమిలో ఆయన ప్రభావాన్ని తక్కువ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతు న్నాయి.
అయితే.. ఇదే కనుక జరిగితే.. ఏం సాదిస్తారు? అనేది ప్రశ్న. పవన్‌ను వచ్చే ఐదేళ్ల వరకు తక్కువగా చూడలేని పరిస్థితి నెలకొంది. కూటమి గెలిచినా.. ఓడినా.. కూడా.. ఆయన ప్రాభవం అలా ఉంది. అలా కాకుండా.. ఇప్పటి నుంచే పవన్‌ను మైనస్ చేస్తే.. అది కూటమి పార్టీలకే మరింత ఇబ్బందిగా మారుతుందనేది వాస్తవం. పైగా ఇప్పుడు గెలిచినా.. వచ్చే ఎన్నికల నాటికి అయనా.. పవన్ వంటి బలమైన నాయకుడ అవసరం అవుతారనేది కూటమి పార్టీలు గ్రహించాల్సిన వాస్తవం.