ఉప ముఖ్యమంత్రిగా పవన్...వ్యూహాత్మకంగానే !

జనసేన అధినేత వేరు. ఉప ముఖ్యమంత్రిగా వేరు. ఇదే పవన్ లో కొట్టొచ్చినట్లుగా కనిపించే మార్పుగా అంతా చూస్తున్నారు.

Update: 2024-07-15 04:11 GMT

జనసేన అధినేత వేరు. ఉప ముఖ్యమంత్రిగా వేరు. ఇదే పవన్ లో కొట్టొచ్చినట్లుగా కనిపించే మార్పుగా అంతా చూస్తున్నారు. జనసేన అధినేత అంటే పూర్తిగా రాజకీయ పార్టీ నాయకుడిగా ఉంటారు. జనంలోకి వస్తే ఆవేశంగా పవన్ మాట్లాడేవారు. దాంతో పాటు కొన్ని సార్లు ఆ ఆవేశం అదుపు తప్పిన సందర్భాలు సైతం ఉన్నాయి.

పవన్ ఆ విధంగా మాట్లాడకపోతే జనంలోనూ మార్పు రాదు, పార్టీ క్యాడర్ లోనూ ఊపు రాదు అన్నది కూడా అప్పట్లో ఒక భావన ఉంది. అదే ఆవేశం పవన్ ని యువతకు దగ్గర చేసింది. మిగిలిన వర్గాలను ఆలోచింపచేసింది. వైసీపీకి అప్పట్లో అది తలనొప్పిగా మారింది. మొత్తానికి ఏమైతేనేమి పవన్ తాను అనుకున్నట్లుగా కూటమిని కట్టించి అధికారంలోకి వచ్చారు.

ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే తనకు నచ్చిన శాఖలను ఆయన తీసుకుని వాటి లోతుల్లోకి వెళ్తున్నారు. నిత్య విద్యార్ధిగా ఉంటూ అంతా నేర్చుకుంటున్నారు. ఏపీ టీడీపీ కూటమి ఏర్పాటు అయి నెల రోజులు పై దాటింది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్ని మార్కులు సాధించారు అంటే మంచి మార్కులే అన్నదే అందరి మాటగా ఉంది.

అధికారంలో ఉన్నాం కదా అని ఒక్క మాట కూడా తూలడం లేదు. విపక్షంలో ఉన్న వైసీపీ నేతలను ఆయన ఇపుడు ఎన్ని అయినా అనవచ్చు. కానీ వారి ఊసు తలవడంలేదు. పైగా తనకు ఎన్నో పనులు ఉన్నాయని ప్రజలు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడంతో ఫుల్ బిజీగా ఉన్నామని చెబుతున్నారు.

ఆయన గత నెల రోజులుగా తన శాఖల మీద వరసబెట్టి సమీక్షలు చేస్తూ వస్తున్నారు వారంలో అన్ని రోజులూ ఆయన రోజంతా అధికారులతోనే ఉంటున్నారు. శాఖాపరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజా కోణంలో ప్రతీ అంశాన్ని చూస్తున్నారు. ప్రజలకు ఏది మేలు అన్నది ఆలోచించి మరీ అధికారులకు సలహాలు ఇస్తున్నారు.

మరో వైపు పవన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్న నాయకుడిగా తనలోని మార్పుని జనాలకు స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఈ అధికారం ప్రజలు ఇచ్చినది. దానిని పవిత్రంగానే నెరవేర్చాలి అని ఆయన చెప్పడమే కాదు ఆచరణలో చూపిస్తున్నారు. ఖజానాలో నిధులు లేవు అని తన నెల జీతాన్ని ఆయన పట్టుకోవడం లేదు. అలాగే తన క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ ని కూడా ప్రభుత్వం ఖర్చుతో వద్దు అని తానే సమకూర్చుకున్నారు.

మరోవైపు చూస్తే తక్కువ ఖర్చుతో పొదుపుగా పాలన చేద్దామని చెబుతూ ఆచరణలో దానిని పెడుతున్నారు. ఈ నెల రోజులలో పవన్ ఎక్కువగా కాషాయ వస్తాలలో కనిపించారు. అంతే కాదు ఆయన దీక్షలను చేపడుతూ తనలోని ఆధ్యాత్మిక భావనలతో ఒక వర్గానికి బాగా చేరువ అయ్యారు.

పవన్ అధికారంలోకి వస్తే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తారని నిత్యం మీడియాలో ఉంటూ వారిని చీల్చి చెందుతారని అంతా భావించారు. ఆయన ఆవేశాన్ని చూసిన వారు పవన్ పవర్ లోకి వస్తే కచ్చితంగా వైసీపీకి ఇబ్బంది అనుకునేవారు. పవన్ మాత్రం తప్పులు ఎవరు చేసినా శాఖాపరమైన చర్యలు ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలకు తావు లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇవన్నీ కలసి పవన్ ని వైసీపీ కూడా ఏమీ అనలేని పరిస్థితిని తీసుకుని వచ్చారు. ఇక న్యూట్రల్ వర్గాలలోనూ పవన్ మంచి నాయకుడిగా ఉన్నారు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. రాజకీయాల్లో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ ఎన్నికల్లో కూటమిని కట్టి 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటే అన్నీ గెలిచిన పవన్ జనసేన 2029 నాటికి పొత్తులో అయినా ఇంతకు మూడింతలు సీట్లు తీసుకునే చాన్స్ ఉంది.

అంతే కాదు ఒకవేళ ఒంటరిగా పోటీ చేసినా తన ఇమేజ్ పార్టీకి ఆయుధం కావాలని పవన్ భావిస్తున్నారు. అందుకే ఆయన చాలా జాగ్రత్తగా తన పదవీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. ఇది జనసేనకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఆ పార్టీకి రానున్న కాలంలో రాచబాట వేస్తుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News