తెలంగాణ సమస్యల గురించి మాట్లాడరు కానీ పోటీ చేసుడా పవన్?
గడిచిన పదేళ్లలో తెలంగాణ ఎదుర్కొంటున్ సమస్యలు.. కేసీఆర్ సర్కారు పాలనలోని అంశాలు.. ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి కనీసం వేలెత్తిచూపించాల్సిన అవసరం ఉంది కదా?
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదేళ్లు. జనసేన పార్టీని ఏర్పాటు చేసి పదేళ్లు అయినప్పటికి.. తన లక్ష్యం ఏమిటి? తన గమ్యం మరేమిటి? అన్న విషయంలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వని వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. స్పష్టత లేనప్పుడు అస్పష్టతతో ఉండాలన్నట్లుగా ఆయన భావిస్తున్నట్లు చెప్పాలి. కొన్నేళ్లుగా ఏపీ మీద మాత్రమే ఫోకస్ చేసి.. తెలంగాణ అంశాల్ని మాట్లాడటం మానేసి చాలా కాలమే అయ్యింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తన పార్టీ ఉండాలన్న అకాంక్షను వ్యక్తం చేసే పవన్ కల్యాణ్.. ఏపీలోని పరిస్థితుల గురించి తరచూ మాట్లాడేటప్పుడు.. తెలంగాణలో పార్టీ ఉన్న వేళ.. ఒక సందర్భంలో కాకుంటే మరో సందర్భంలో అయినా కనీసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. గడిచిన పదేళ్లలో తెలంగాణ ఎదుర్కొంటున్ సమస్యలు.. కేసీఆర్ సర్కారు పాలనలోని అంశాలు.. ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి కనీసం వేలెత్తిచూపించాల్సిన అవసరం ఉంది కదా?
కానీ.. అలాంటిదేమీ లేకుండా.. సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం పోటీ గురించి ప్రస్తావించటం వల్ల ప్రయోజనం ఏముంటుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్లు చెప్పే పవన్ కల్యాణ్.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కనీస స్థాయిలో కూడా మాట్లాడలేదని చెప్పాలి. మొత్తం 119 స్థానాలున్న తెలంగాణలో థర్టీ ప్లస్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
తమ పార్టీ పోటీ చేసే స్థానాల్ని ప్రకటించిన ఆయన.. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సత్తా చాటతానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తాను పోటీ చేయటం లేదని ప్రకటించటం తెలిసిందే. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాము పోటీ చేస్తామని చెప్పే పవన్.. ఏ ప్రాతిపదికన.. ఏయే అంశాల్ని ప్రస్తావిస్తూ ఎన్నికల వేళ.. ప్రజల ముందుకు రానున్నారు? అన్నది ప్రశ్న. తెలంగాణలోచోటుచేసుకున్న ఎన్నో పరిణామాలపై కనీసం స్పందించని పవన్.. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని ఓటు అడిగేందుకు వస్తున్నారన్న ప్రశ్నకు సరైన సమాధానం అవసరమని చెప్పాలి. పవన్ నుంచి ఈ తరహా సమాధానాల్ని ఆశించటం అత్యాశే అవుతుందేమో?