జనసేనాని పోటీ అక్కడి నుంచేనా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఏపీలోనూ ఎన్నికల వేడి మొదలైంది
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఏపీలోనూ ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి జనసేనాని పవన్ కళ్యాణ్ పైనే ఉంది. మూడు ప్రధాన పార్టీల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయడం ఖాయం. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపైన చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో పవన్.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.
కాగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి బరిలోకి దిగుతారని టాక్ నడుస్తోంది. పార్టీ వర్గాలు కూడా పవన్ తిరుపతి నుంచే పోటీ చేస్తారని చెబుతున్నాయి.
తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలతో జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు సమావేశమయ్యారు. రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ పవన్ తిరుపతిలో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని నాగబాబుకు వివరించారు.
తిరుపతి నియోజకవర్గంలో బలిజలు (కాపు) ఎక్కువ సంఖ్యలో ఉన్నారని.. ఈ నేపథ్యంలో పవన్ పోటీ చేస్తే గెలుపొందుతారని చెబుతున్నారు. కాగా 2009లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తిరుపతి నుంచి బరిలోకి దిగి 15 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా తిరుపతి జనసేన నేతలు నాగబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా ఈసారి టీడీపీతో పొత్తు కూడా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలుపు మరింత సునాయాసంగా మారుతుందని నాగబాబుకు చెప్పారని అంటున్నారు. తిరుపతి జనసేన నేతలు చెప్పిన కారణాలపై నాగబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. పవన్ దృష్టికి ఈ విషయాలన్నింటిని తీసుకెళ్తానని చెప్పినట్టు సమాచారం.
కాగా 2019 ఎన్నికల్లో తిరుపతి జనసేన పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేశారు. ఆయనకు పది వేలకు పైగా ఓట్లు ఇచ్చాయి. ఇక టీడీపీ తరఫున సుగుణమ్మ పోటీ చేశారు. వైసీపీ తరఫున పోటీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే వైసీపీ పెనుగాలిలోనూ భూమన కేవలం 800 ఓట్ల తేడాతోనే బయటపడటం గమనార్హం.
ఈసారి ఎన్నికల్లో భూమనకు బదులుగా ఆయన కుమారుడు భూమన అభినయర్ రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అభినయ్ రెడ్డి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కు డిప్యూటీ మేయర్ గా వ్యవహరిస్తున్నారు.