జగన్ పాదయాత్రకు-లోకేష్ పాదయాత్రకు తేడా చెప్పిన పవన్
ఏపీ భవిష్యత్తు నిలదొక్కుకునే వరకు పొత్తు ఉంటుందని, టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు
ఏపీలో టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్టాడుతూ.. నారా లోకేష్ పాదయాత్రపై ప్రశంసలు కురిపించారు. ఇదేసమయంలో గతంలో వైసీపీ అధినేతగా ప్రస్తుత సీఎం జగన్‌చేపట్టిన పాదయాత్రకు, నారా లోకేష్ పాదయాత్రకు మధ్య చాలా తేడా ఉందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
''జగన్ పాదయాత్ర ప్రజలను మోసం చేసేందుకు చేపట్టిన పాదయాత్ర. కానీ, నారా లోకేష్ పాదయాత్ర జనాలకు ధైర్యం చెప్పేందుకు, వారి సమస్యలు ఆలకించేందుకు చేపట్టిన పాదయాత్ర'' అంటూ.. పవన్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ''ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం విలువ తెలియదు. ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లిని విలువ ఇవ్వనివాడు మనకు ఎందుకు? వైపీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దూషిస్తారా? మా కార్యకర్తలపై దాడులు చేయిస్తారా?'' అని పవన్ ఫైర్ అయ్యా.
ఏపీ భవిష్యత్ నిర్మాణానికి పొత్తు ఉండాలని పవన్ చెప్పారు. ఏపీ భవిష్యత్తు నిలదొక్కుకునే వరకు పొత్తు ఉంటుందని, టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. టీడీపీతో సంయుక్తంగా కార్యక్ర మాలు రూపొందిస్తామని, భవిష్యత్తు సభలో కార్యాచరణను ప్రకటిస్తామని పవన్ చెప్పారు. చంద్రబాబును అన్యాయంగా జైలులో పెడితే బాధ కలిగిందన్న పవన్... కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని అనుకున్నట్టు తెలిపారు.
ఇక, తాను రేపు ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదని పవన్ చెప్పారు. ఏపీలో 2024 ఎన్నికల అనంతరం వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమేనని పవన్ చెప్పారు. ''లోకేశ్‌ది మాటల పాదయాత్ర కాదు.. చేతలు చూపే పాదయాత్ర. ప్రజల సమస్యలు వింటూ లోకేశ్ పాదయాత్ర చేశారు. జగన్‌రెడ్డి పాలనలో ఏపీ సర్వనాశనమైంది'' అని పవన్ అన్నారు. తాను పాదయాత్ర చేయాలని ఉన్నా.. చేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.