బీజేపీ కోసం మహారాష్ట్రకు పవన్... షెడ్యూల్ ఇదే!

ఈ సమయంలో... ఎన్డీయే భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యత అప్పజెప్పింది.

Update: 2024-11-15 09:50 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సర్వేల ఫలితాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో... ఎన్డీయే భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యత అప్పజెప్పింది. ఇందులో భాగంగా... మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించింది!

అవును... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది భారతీయ జనతాపార్టీ. ఇందులో భాగంగా... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరుపున ప్రచారం చేయాల్సిందిగా పవన్ ను కోరింది! ఈ అభ్యర్థన మేరకు పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు.

ఈ క్రమంలో... భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఎక్స్ వేదికగా షెడ్యూల్ కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ ప్రచారం షెడ్యూల్ ఖరారైంది.

ఇందులో భాగంగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఐదు బహిరంగ సభలతో పాటు రెండు రోడ్ షో ల్లోనూ పాల్గొంటారు. ఈ క్రమంలో... మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. 16వ తేదీ ఉదయం నాంధేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

అనంతరం.. అదే జిల్లాలోని భోకర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొని.. మధ్యాహ్నం 2 గంటల సమయానికి లాతూర్ కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలోనూ పాల్గొని.. రాత్రి 6 గంటలకు షోలాపూర్ నగరంలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.

ఇక మరుసటి రోజు నవంబర్ 17వ తేదీ షెడ్యూల్ విషయానికొస్తే... ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పూణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం.. కస్బా పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రచార సభలో పాల్గొంటారు.

కాగా... 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న ప్రకటిస్తారు.

Tags:    

Similar News