తన సినిమాల మీద పవన్ మార్క్ సంచలన వ్యాఖ్యలు

పదేళ్ళుగా జనసేన అధినేతగా ఆయన పడిన కష్టానికి మొత్తానికి తగిన ఫలితం దక్కింది.

Update: 2024-11-01 15:15 GMT

పవన్ కళ్యాణ్ మొదట పవర్ స్టార్. ఆ తరువాత ఆయన జనసేనాని. అయితే ఆయనకు మొదటి నుంచి సమాజం పట్ల నిబద్ధత ఉంది అని అంటారు. అందుకే ఆయన సినిమాల్లో హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నా కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చేశారు. పదేళ్ళుగా జనసేన అధినేతగా ఆయన పడిన కష్టానికి మొత్తానికి తగిన ఫలితం దక్కింది.

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏపీ జనం ముందు కనిపిస్తున్నారు. దానికి ఆయనతో పాటు జనసైనికులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. అయితే పవన్ ని చూస్తే చాలు అభిమానులైన జనసైనికులకు ఆయన సినిమాలు గుర్తుకు రావడం యాధృచ్చికమే. పవన్ కళ్యాణ్ ని వారు అలాగే చూస్తూ ఆనందం పొందుతున్నారు.

అందుకే పవన్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలమండపం ఐఎస్ జగన్నాధపురంలో దీపం పధకం 2 ని ప్రారంభిస్తూ చేసిన ప్రసంగంలోనూ అభిమాన జనం హుషారెత్తించారు. ఓజీ ఓజీ అంటూ వారు హడావుడి చేశారు. ఇది ఒక విధంగా పవన్ కే ఊహించని అనుభవంగా చెబుతున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడుతున్నారు. కానీ జనాలు మాత్రం ఓజీ అంటూ నినాదాలు ఇవ్వడంతో పవన్ కూడా దాని మీద సంచలన కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మనసులో మాటనే చెప్పారు అనుకోవాలి. సినిమాలు అన్నవి సరదాకు మాత్రమే అని పవన్ చెప్పేశారు. అంతే తప్ప అవే జీవితం ఎంత మాత్రం కానే కాదని స్పష్టం చేశారు. సినిమాల నామస్మరణను పక్కన పెట్టి అందరూ భగవంతుడి నామస్మరణను చేస్తే మంచి ఫలితాలు వస్తాయని జీవితంలో అద్భుతాలే జరుగుతాయని పవన్ చెప్పడం విశేషం.

ఇలా అందరి జీవితాలూ బాగుపడతాయని కూడా పవన్ చెప్పారు. ఒక విధంగా పవన్ తన సినీ అభిమానులకు ఇచ్చిన సందేశంగా దీనిని చూడాలి. తనను చూస్తే ఇంకా సినీ హీరో అన్న భావన నుంచి వారు పక్కకు జరగాలని తనలోని నాయకుడిని చూడాలని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు.

పవన్ కి అయితే సినిమా వ్యామోహం ఏదీ లేదు అనే చెప్పాలి. ఆయన వెండితెర ప్రపంచానికి దూరంగానే ఉంటున్నారు. తాను కమిట్ అయిన సినిమాలనే ఆయన పూర్తి చేస్తున్నారు. ఒకవేళ ఫ్యూచర్ లో సినిమాలు చేసినా దానిని ఒక బాధ్యతగా చేయాలనే ఆయన సంకల్పించి నట్లుగా ఉన్నారు.

అయితే అభిమానులు మాత్రం ఇంకా సినీ మోజులోనే ఉంటూ అసలైన జీవితాన్ని తమ భవిష్యత్తుని అలా లైట్ తీసుకుంటున్నారు అన్నది కూడా ఆయన ఆలోచన కావచ్చు. అందుకే అందరి జీవితాలు బాగుపడేది దైవ ధ్యానంలో జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో అని ఏ సినీ హీరో ఇవ్వని ఒక అద్భుతమైన సందేశాన్నే ఇచ్చారు.

నిజంగా పవన్ అభిమానులు దీనిని స్పూర్తిగా తీసుకుని సినిమాలు జస్ట్ సరదాకు టైం పాస్ కి అన్నది ఆలోచించాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాదు పవన్ లోని తాత్వికతను ఆయన ఆలోచలనను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే అది వారికీ సమాజానికి జనసేనకూ ఇంకా మంచిది అని కూడా అంటున్నారు. సో తన సినిమాల మీద పవన్ మార్క్ కామెంట్స్ అయితే ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పాల్సిఉంది.

Tags:    

Similar News