పవన్ కల్యాణ్ ఛాంబర్ మార్పు... అసలు కారణం ఇదే!

ఈ సందర్భంగా తొలుత విజయవాడలోని నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు.

Update: 2024-06-18 09:45 GMT

బుధవారం ఏపీ డిప్యుటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సచివాలయంలో ఆయన ఛాంబర్, విజయవాడలో నివాసం విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తొలుత విజయవాడలోని నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఆలోచనలు, అభిరుచి మేరకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.. ఆఫీసు నిర్మాణంలో మార్పులు చేసినట్లు చెబుతున్నారు. పవన్ కు నచ్చే మెచ్చే విధంగా కలర్స్ లో మార్పులు చేర్పులు చేసి ఆఫీస్ నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. ఇదే సమయలో... పై అంతస్తులో నివాసం, కింద ఆఫీసు ఏర్పాటు చేశారు.

అదే భవనంలో పక్కన సమావేశ మందిరం కూడా అందుబాటులో ఉండటంతో పవన్ ఈ ప్లాన్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే ఆఫీసును వినియోగించుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ అభిరుచికి అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చేపట్టారు.

ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ఇంక కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో... పవన్ కోసం ఛాంబర్ సిద్ధమైంది. వాస్తవానికి తొలుత రూం నెంబర్ 212, 214 కేటాయించారు.. అయితే జాతకాలు, వాటికి సరిపోయే వాస్తులు దృష్ట్యా మంత్రులు అంతా ఒక అండర్ స్టాండింగ్ తో వారి వారి రూములను ఒకరికొకరు మార్చుకుంటున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగానే పవన్ కు తొలుత కేటాయించిన 212, 214లను మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకోగా.. 211 తనకు సూటవుతుందని పవన్ ఫిక్సై ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో... ఈ గదిని పవన్ కల్యాణ్ కోసం సిద్ధం చేశారు. బుధవారం (19 జూన్) పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచే బాధ్యతలు చేపట్టనున్నారు.

కాగా... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కు వై ప్లస్ సెక్యూరిటీతోపాటు బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ప్రభుత్వం కేటాయించింది. ఇక, బుధవారం పవన్ కల్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tags:    

Similar News