పవన్ తో గంటా...అంతా ఓకేనా...?
ఇవన్నీ ఇలా ఉంటే విశాఖకు తాజాగా వచ్చిన పవన్ కళ్యాణ్ ని ఒక హొటల్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు కలిశారు. వారిలో అందరినీ ఆకట్టుకున్నది గంటా శ్రీనివాసరావు.
జనసేనను పవన్ స్థాపించడం వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటారు. అందులో ముఖ్యమైనది ప్రజారాజ్యం పార్టీ అర్ధాంతరంగా పతనం చెందడం. ఆ పార్టీ పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయింది. 2008 ఆగస్టులో పుట్టిన పీయార్పీ 2011లో కాంగ్రెస్ లో విలీనం అయింది. అంటే కేవలం మూడేళ్ళు మాత్రమే మనుగడలో ఉంది అన్న మాట
ప్రజారాజ్యం పార్టీ ఒక సునామీగా ఉప్పెనగా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు బిగ్ షాట్స్ వైఎస్సార్ చంద్రబాబులతో ఒకేమారు ఢీ కొట్టడం కూడా ఇబ్బంది అయింది. అంతే కాదు తెలంగాణా ఉద్యమం కూడా మరో ఇబ్బందిగా మారింది.
అయినా సరే కేవలం ఎనిమిది నెలల కాలంలో ఆ పార్టీ 18 శాతం ఓట్ల షేరింగ్ ని పద్దెనిమిది సీట్లను సాధించింది. చాలా చోట్ల తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలు అయింది. 2014 దాకా ప్రజారాజ్యం ఉన్నట్లైతే చిరంజీవే సీఎం అని అంతా ఇప్పటికీ నమ్ముతారు. అలా కాకుండా పీయార్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు వత్తిడి చేసిన వారిలో నాటి పీయార్పీ కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు కూడా ఒకరని ప్రచారం జరిగింది.
దానికి బదులుగా ఆయనకు కాంగ్రెస్ మంత్రి వర్గంలో కీలక మంత్రిత్వ శాఖ దక్కింది. దాంతో నాడు యువరాజ్యం అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తో పీయార్పీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని కూడా అంటారు. విలీన ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో ఆయన వద్దు అని చెప్పినా చిరంజీవి చుట్టూ చేరిన ఒక టీం ఆయన మాటలను పట్టించుకోలేదు అని అంటారు.
దాంతోనే ఆయన రగిలి జనసేనను తరువాత కాలంలో ప్రారంభించారు. ఇదిలా ఉంటే 2017 నుంచి ఆయన ఏపీలో టీడీపీని వ్యతిరేకిస్తూ సభలు సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో విశాఖలో నిర్వహించిన సభలలో నాటి టీడీపీ మంత్రి గంటా మీద కూడా హాట్ హాట్ గా కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక 2019లో టీడీపీ ఓడాక గంటా జనసేనలో చేరడానికి ప్రయత్నించారని కూడా ఒక దశలో ప్రచారం సాగింది.
ఇవన్నీ ఇలా ఉంటే విశాఖకు తాజాగా వచ్చిన పవన్ కళ్యాణ్ ని ఒక హొటల్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు కలిశారు. వారిలో అందరినీ ఆకట్టుకున్నది గంటా శ్రీనివాసరావు. ఆయన స్వయంగా పవన్ కి పుష్ప గుచ్చం ఇచ్చి ఆయనతో కలసి ఫోటోలు దిగారు.ఈ ఇద్దరు నేతలూ పక్క పక్కన నిలుచుకుని మిగతా వారు చేరో వైపుగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.
గంటా విషయంలో పవన్ అభిప్రాయం మారిందా అన్నది ఇక్కడ చర్చగా ఉంది. అయితే తెలుగుదేశం ప్రతినిధుల బృందంతో ఆయన కూడా వచ్చారని అతిధి మర్యాదలతో భాగంగా పవన్ ఆయనతోనూ ఉన్నారు అని అంటున్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్తే టీడీపీతో పొత్తు ఉంది. గంటా మాజీ మంత్రి. అందువల్ల పొత్తు ధర్మంలో భాగంగా పవన్ టీడీపీ నేతలను కలవడంలో వింతేమీ లేదు అంటున్నారు.
ఏది ఏమైనా గంటా పవన్ కలసి ఉన్న ఫోటో మాత్రం చర్చనీయాంశంగా ఉంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు, విమర్శలు చేసుకున్నా పరిస్థితులు మారితే కలిసిన వారూ ఉన్నారు. పైగా గంటా మెగా కాంపౌండ్ కి చాలా కావాల్సిన వారు. ఇక పవన్ కూడా ఒకనాడు టీడీపీని విమర్శించారు. ఇపుడు పొత్తులు పెట్టుకుంటున్నారు. దాంతో ఇవన్నీ జస్ట్ పాలిటిక్స్ అని సర్దుకుని పోవాల్సిందే అంటున్నారు. సో టీడీపీ జనసేన ఇష్టుడిగా కీలక నేతగా ఇక మీదట విశాఖ జిల్లాలో గంటా చక్రం గిర్రున తిరుగుతుంది అని అంటున్నారు.