జనసేనానికి మెగాస్టార్ ఫుల్ సపోర్ట్...?
కొంత మంచి ఎంతో చేదు ఇలా అన్నీ అనుభవించిన తరువాత పాలిటిక్స్ కి ఒక దండం పెట్టేసి ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నారు
రాజకీయాల మీద చిరంజీవికి ఆసక్తి లేదు అంటారు. అది నిజమే. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాలను పూర్తిగా చూశారు. కొంత మంచి ఎంతో చేదు ఇలా అన్నీ అనుభవించిన తరువాత పాలిటిక్స్ కి ఒక దండం పెట్టేసి ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నారు. చిరంజీవి ఎక్కడైతే వదిలేశారో అక్కడే పవన్ కళ్యాణ్ తన రాజకీయాన్ని స్టార్ట్ చేశారు.
జనసేన పార్టీ పెట్టి తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడినా కూడా పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా జనసేనాని రాజకీయాల్లో తన అదృష్టాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జనసేనకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని అప్పట్లో ప్రచారం సాగింది.
దానికి ఇటీవల బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా హీరోలు యంగర్ జనరేషన్ సరైన రిప్లై ఇచ్చారు. మేమంతా పవన్ వెంటే అని అన్నారు. పవన్ కి మెగా కుటుంబం పూర్తి మద్దతు ఉంటుంది అని యంగ్ హీరో సాయి ధర్మ తేజ్ చెప్పుకొచ్చారు.
ఇపుడు భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అయితే జబర్దస్ట్ నటుడు ఆది మెగాభిమానిగా స్పీచ్ ఇచ్చేశాడు. ఆయన చిరంజీవి గురించి పవర్ స్టార్ గురించి కూడా చెప్పాల్సింది చెప్పేశాడు. భోళా శంకర్ షూటింగ్ టైం లో తాను చిరంజీవిని న్యూస్ పేపర్స్ చదవరా అని అడిగాను అని, తన తమ్ముడిని తిడుతున్న వార్తలను చూడలేక పేపర్స్ చదవడం లేదు అని మెగాస్టార్ జవాబు చెప్పారని ఆది చెప్పుకొచ్చారు.
చాలా మంది అన్నను పొగిడి తమ్ముడిని తిడతారు. కానీ వారికి తెలియని విషయం ఏంటి అంటే చిరంజీవికి తమ్ముడు పవన్ అంటే ప్రాణం. ఆయనకే మెగాస్టార్ ఫుల్ సపోర్ట్ అని ఆది అసలు విషయం చెప్పారు. దీన్ని బట్టి చూస్తే జనసేన వచ్చే ఎన్నికల్లో సూపర్ హిట్ కావాలని మెగాస్టార్ ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు.
అవసరం అయితే ఈసారి మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటిగా పవన్ వెంట నిలుస్తుంది అని అంటున్నారు. అదే టైం లో వచ్చే ఎన్నికల్లో ఆరు నూరు అయినా జనసేనను గెలిపించి తీరాలని మెగాభిమానులు కూడా కంకణం కట్టుకున్నారు అని అంటున్నారు. దానికి నాందిగానే మెగాభిమానిగా ఆది ఈ స్పీచ్ ప్రత్యేకంగా ఇచ్చారని అంటున్నారు.
ఆ మధ్యన విజయవాడలో మెగాభిమానులు అంతా చేరి జనసేనకే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి ఏపీలోని రాజకీయ పార్టీలు చిరంజీవికి రాజకీయ ఆసక్తి లేదని అనుకోవచ్చు కానీ ఆయంకు ఆసక్తి ఉందని అది జనసేనాని మీదనే అని ఆది మాటలను బట్టి అర్ధం చేసుకోవాల్సి ఉంది.
ఇంకా చెప్పాలీ అంటే వచ్చే ఎన్నికలలో మెగాస్టార్ ప్రచారం చేస్తారా అన్న డౌట్లు కూడా చాలా మందికి ఉన్నాయి. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అనూహ్యమైన పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పాలిటిక్స్ కాబట్టి. పొత్తులు లేకుండా జనసేన ఒంటరిగా దిగితే మాత్రం మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ వెంట వచ్చినా ఆశ్చర్యం లేదు అనే అంటున్నారు. మొత్తానికి చూస్తే జనసేన చుట్టూ మెగాభిమానం ఎంతలా అల్లుకుందో ఆది భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పేశారు.ఇది మెగా ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ మెగా పవర్ ఫ్యాన్స్ కి కూడా గుడ్ న్యూసే మరి.