పవన్ శపధం పట్టిన చోట ఆ పార్టీ సీన్ ఇదే...!
తీరా ఎన్నికలు దగ్గరపడిన వేళ చూస్తే గోదావరి జిల్లాలలో జనసేన ఖాళీ అవుతోందని అంటున్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఏడాది గోదావరి జిల్లాలలో పర్యటించారు. ఆయన వారాహి రథమెక్కి ఉభయ గోదావరి జిల్లాలలో భారీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ ప్రతీ చోటా ఒకే మాట చెప్పేవారు. వైసీపీకి ఉభయ గోదావరి జిల్లాలలో ఒక్క సీటూ రాకుండా చూడాలని. అలా తాను చేస్తాను అని శపధం కూడా పట్టారు.
తీరా ఎన్నికలు దగ్గరపడిన వేళ చూస్తే గోదావరి జిల్లాలలో జనసేన ఖాళీ అవుతోందని అంటున్నారు. కీలక నేతలు నిన్నటిదాకా నియోజకవర్గాలకు ఇంఛార్జిగా ఉన్న వారు అంతా వైసీపీలో చేరిపోతున్నారు. వారంతా ఎమ్మెల్యే అభ్యర్ధులుగా ఉన్నారు. అలాగే ఆశావహులుగా ఉన్నారు.
వారికే టికెట్ అని జనసామాన్యంలో అంతా అనుకున్న నేపధ్యం ఉంది. అయితే చాలా చోట్ల జనసేనకు పొత్తులో సీట్లు దక్కలేదు. ఇక దక్కిన సీట్లలో కూడా పారా చూట్ లీడర్లు వచ్చి వాటిని తన్నుకుపోయారు. దాంతో జనసేన నేతలు అంతా పూర్తిగా అసంతృప్తికి లోను అయ్యారు. వారు ఏకంగా తమ కోపాన్ని నిరసనను ప్రదర్శించేందుకు వైసీపీని ఆశ్రయిస్తున్నారు.
దాంతో పవన్ చెప్పినది ఏమిటి జరుగుతున్నది ఏమిటి అన్న చర్చ వస్తోంది. వైసీపీని గోదావరి జిల్లాలలో లేకుండా చేయడం అటుంది జనసేన ఖాళీ అవుతోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే జనసేన నుంచి ఇప్పటిదాకా వైసీపీలోకి వెళ్ళిన నేతల లిస్ట్ చూస్తే ఇలా ఉంది. పిఠాపురంలో గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి 28 వేల ఓట్ల దాకా తెచ్చుకున్న మాకినీడు శేషుకుమారి వైసీపీ నీడన చేరారు. అక్కడ స్వయంగా పవన్ పోటీ చేస్తూంటే ఆమె పార్టీ మారడం విశేషం.
మరో వైపు చూస్తే ముమ్మిడివరం, అమలాపురం జనసేన పార్టీ ఇంచార్జిలు కూడ వైసీపీలో చేరిపోయారు. తాజాగా చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కీలక నేత బొంతు రాజేశ్వరరావు వైసీపీలో చేరిపోయారు. బొంతు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తే ఆయన మీద జనసేన నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు గెలిచారు. ఆ తరువాత రాపాక వైసీపీలో చేరారు. ఇపుడు బొంతు కూడా జనసేన నుంచి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. దీంతో రాజోలులో జనసేనకు ఇబ్బందుకు తప్పవని అంటున్నారు.
అక్కడ టికెట్ ని జనసేన రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ కు ఇవ్వడంతో బొంతు ఆగ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరే కాదు విజయవాడ తూర్పు పశ్చిన నేతలు జనసేన నుంచి వైసీపీలో చేరిపోయారు. ఇలా చూస్తే కనుక పరుచూరి భాస్కరరావు,పితాని బాలకృష్ణ , పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజబాబు, మాకినీడి శేషుకుమారి వంటి నాయకులు జనసేనకు రాజీనామా చేశారు.ఈ విధంగా చాలా మంది కోస్తాలో గోదావరి జిల్లాలలో జనసేనను వీడడం విశేషం.
ఈ జంపింగులే కాదు, రాయలసీమలో జనసేన నుంచి మరో కీలక నేత పార్టీని వీడబోతున్నారు అని అంటున్నారు. నంద్యాల జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ సైతం వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. ఆయన కూడా టికెట్ ని ఆశించి భంగపడిన వారి జాబితాలో ఉన్నారని అంటున్నారు. ఇదే తీరులో మరింత మంది నాయకులు జనసేన నుంచి వైసీపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జనసేనను వైసీపీ టార్గెట్ చేసింది. దాంతో వారంతా ఫ్యాన్ నీడకు వస్తున్నారు. మొత్తం మీద చూస్తే జనసేన నుంచి భారీగా బయటకు వస్తున్న నేతలతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతోంది.