పవన్ తొందరపడ్డారా ?
ఎన్డీయే సమావేశానికి ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొందరపడినట్లున్నారు.
ఎన్డీయే సమావేశానికి ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొందరపడినట్లున్నారు. సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఒకవైపు పొత్తుల్లో టీడీపీని కూడా కలుపుకునేట్లు బీజేపీ పెద్దలను ఒప్పిస్తానని చెబుతునే మరోవైపు టీడీపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడంలో అర్థం లేదు. పొత్తులో టీడీపీని కలుపుకోవాలన్నది పవన్ ఆలోచన మాత్రమే. అయితే బీజేపీ పెద్దల ఆలోచన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
పొత్తులో టీడీపీని కూడా కలుపుకోవాలని పవన్ ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా బీజేపీ అగ్రనేతలు ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. మరలాంటప్పుడు పవన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీతో పొత్తు నుండి బయటపడలేకే పవన్ నానా అవస్థలు పడుతున్నారు.
అలాంటిది టీడీపీతో పొత్తు అంశం తన చేతిలో లేదన్న చిన్న విషయాన్ని పవన్ గ్రహించలేకపోయారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నరేంద్రమోడీ అనుకుంటే అసలు పవన్ మధ్యవర్తిత్వమే అవసరంలేదు.
రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వాత మిత్రులు ఉండరనే నానుడి అందరికీ తెలిసిందే. ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు వస్తాయని మోడీకి అనిపిస్తే చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకోవటం కాదు మోడీయే చంద్రబాబు దగ్గరకు వస్తారు.
టీడీపీతో పొత్తు విషయం బీజేపీ పెద్దలతో మాట్లాడే ఆలోచన ఉన్నపుడు ఆ విషయాన్ని పవన్ బయటకు చెప్పకూడదు. ఎందుకంటే మిత్రపక్షమనే కానీ పవన్ను మోడీ, అమిత్ షా పెద్దగా పట్టించుకోవటంలేదు.
ఆ విషయం అందరు చూస్తున్నదే. మరి ఏ ఆలోచనతో రాబోయే ఎన్నికల్లో మూడుపార్టీలు కలిసి పోటీచేస్తాయని ప్రకటించారో అర్ధంకావటంలేదు. పవన్ ఎంత ప్రయత్నిస్తున్నా మోడీ, అమిత్ కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వటంలేదు. అవకాశం ఉంటే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో లేదంటే ఏపీ ఇన్చార్జిలు మురళీ ధరన్, సునీల్ దియోధర్ తో మాత్రమే భేటీ అయి వచ్చేస్తున్నారు. ఈ విషయాలను అందరు చూస్తున్నారు.
తనకు మోడీ చాలా సన్నిహితుడని పవన్ చెప్పుకోవటం కాదు. మోడీ కూడా అలా అనుకున్నపుడే పవన్ కు అపాయిట్మెంట్ దొరుకుతుంది. మరి ఇంతచిన్న లాజిక్ మరచిపోయి పవన్ ఎందుకు తొందరపడ్డారో తెలీటంలేదు.