టీడీపీ కంచుకోటలో వారాహి మూడవ యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రధయాత్ర మూడవ విడత తొందరలోనే ఉత్తరంధ్రా జిల్లాలలో మొదలు కాబోతోంది.

Update: 2023-07-30 04:09 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రధయాత్ర మూడవ విడత తొందరలోనే ఉత్తరంధ్రా జిల్లాలలో మొదలు కాబోతోంది. అది కూడా ఉత్తరాంధ్రా ముఖద్వారం అయిన విశాఖ నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతోంది. ఆగస్ట్ నెలలో ఉత్తరాంధ్రాలో పవన్ వారాహి రధం ఉత్తరాంధ్రా జిల్లాల గుండా సాగే అవకాశాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా పవన్ తిరిగే నియోజకవర్గాలు అన్నీ టీడీపీకి కంచుకోటల లాంటివే అని అంటున్నారు. పవన్ ఈ యాత్రలో భాగంగా గాజువాక, పెందుర్తి, విశాఖ నార్త్, భీమునిపట్నం, అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, పాయరరావు పేటలలో వారాహి రధాన్ని పరుగులు పెట్టిస్తారు అని అంటున్నారు.

ఆ తరువాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తరువాత విడత వారాహి యాత్రలు ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తూ వారాహి రధమెక్కి సభలలో ప్రసంగిస్తారు అని అంటున్నారు. అలా ఆయన కీలక నియోజకవర్గాలలో పర్యటిస్తారు.

పవన్ పర్యటించే నియోజకవర్గాలు, ఆయన ప్రసంగించే సభలతో జనసేన పోటీ చేసే సీట్లు ఏమిటి, పొత్తులు కనుక ఉంటే వేటిని పట్టుబట్టి మరీ తీసుకుంటుంది అన్న దాని మీద ఫుల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే టైం లో పవన్ ఉత్తరాంధ్రా టూర్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆయన టూర్ ని సక్సెస్ చేసే పనిలో ఇప్పటి నుంచే జనసేన నేతలు రంగంలోకి దిగారు. అదే టైం లో ఇటీవల జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వారాహి యాత్ర ఉత్తరాంధ్రా జిల్లాల్లో విజయవంతం చేసే పనిలో ఉన్నారు.

ఇక పవన్ రధం ఎక్కడ ఆగుతుందో అక్కడ సీటు గల్లంతు అయ్యే చాన్స్ ఉందని తమ్ముళ్ళు కలవరపడుతున్నారు. తమకు టికెట్లు దక్కకపోవచ్చు అన్న ఆందోళన వారిలో ఉంది. అయితే అందుకు మానసికంగా సిద్ధపడాల్సిందే అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కీలకమైన సీట్లుగా భీమిలీ, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలిలను జనసేన పెట్టుకుంది. ఈ సీట్లలో టీడీపీ నుంచి బడా నేతలు, జిల్లాలోని ప్రముఖులే ఉన్నారు. ఇపుడు వారాహి యాత్ర మొదలైతే ఆయన సీట్ల విషయంలో జనసేనకు ఉన్న బలం ఆశావాహులు అన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది.

అయితే జనసేన అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గాల నేతలు ఫుల్ అలెర్ట్ అయిపోయారు. జనసేన మీటింగ్స్ ని విజయవంతం చేయడం ద్వారా సీటు మీద కర్చీఫ్ వేసేందుకు వారంతా ముందుకు వస్తున్నారు. దీంతో ఏమవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News