పవన్ హోంశాఖ తీసుకోకపోవడానికి చిరంజీవి సినిమానే కారణం!?
ఎన్నికల సమయంలో మహిళల భద్రత గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆయనలో ఉన్న ఫైర్ చూసినవాళ్లంతా.. హోంమినిస్టర్ అయితే బాగుంటుంది అనే కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయంలో మహిళల భద్రత గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆయనలో ఉన్న ఫైర్ చూసినవాళ్లంతా.. హోంమినిస్టర్ అయితే బాగుంటుంది అనే కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో జనసైనికుల నుంచి ఈ వాయిస్ బలంగా వినిపించిన పరిస్థితి. ఆయన తన దృష్టంతా పూర్తిగా గ్రామాల అభివృద్ధిపై సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తాను హోంమంత్రి పదవి తీసుకోకపోవడానికి గల కారణాలను ఆయన వివరించారు.
అవును... అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారి పల్లెలో "స్వర్ణ గ్రామ పంచాయతీ" పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో గ్రామాల అభివృద్ధి పాత్రను సవివరంగా ఉదాహరణలతో వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే హోం మినిస్టర్ ప్రస్థావన తెచ్చారు.
ఈ సందర్భంగా.. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యమైనదని.. ఉన్న నిధులు దారి మళ్లించిన పరిస్థితి గతంలో చూశామని.. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13,326 పంచాయతీలు బలపడితే రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నా తీర్చగలమని ఆయన స్పష్టం చేశారు!
ఇదే సమయంలో.. బాధ్యతల నుంచి తాము పారిపోమని.. నిరంతరం పనిచేస్తూనే ఉంటామని చెప్పిన పవన్... అద్భుతాలు చేయడానికి తమ చేతుల్లో మంత్రదండం లేదని, కానీ.. గుండెల నిండా నిబద్ధత ఉందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనుభవం ఏపీకి ఎంతో అవసరమని చాలా సభల్లో చెప్పినట్లు చెప్పిన పవన్... పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకుందని తెలిపారు.
ఇక.. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని చెప్పిన పవన్... గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి గ్రామసభలు చాలా కీలకం అని అన్నారు. ఈ నేపథ్యంలోనే... తనను హోం మంత్రి తీసుకోవాలని చాలా మంది అడిగారని.. అయితే తాను చిన్నప్పటినుంచీ అన్నా హజారే అంటే పడిచచ్చిపోయేవాడినని తెలిపారు.
"మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవీణ కూడా ఉంటుంది.. అది అన్నా హజారే గారి ప్రేరణతో తీసిందే" అని పవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక సర్పంచ్ ఎంత బలవంతుడో చెప్పే ప్రయత్నం చేశారు పవన్. ఇందులో భాగంగా... ఎక్కడో మిలటరీలో పనిచేసి, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి వచ్చి, అక్కడున్న పరిస్థితులు చూసి, ముందుకొచ్చి సర్పంచ్ గా అయ్యారని అన్నా హజారే గురించి తెలిపారు.
నాడు ఆ గ్రామాన్నే కాదు, దేశాన్నే కదిలించింది ఒక సర్పంచ్ అని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. లోక్ పాల్ బిల్లు కానీ, సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినవే అని తెలిపారు. ఈ సందర్భంగా... ఓ సర్పంచ్ తలచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందని నిరూపించారని వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్.