జనసేన లోపాన్ని అంగీకరించిన పవన్... తెరపైకి కీలక ప్రశ్నలు!
అవును... తాజాగా తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడేపల్లిగూడెంలో టీడీపీ - జనసేన నిర్వహించిన ఉమ్మడి సభలో పవన్ కల్యాణ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, జగన్ పై విమర్శలు, చంద్రబాబుపై ప్రశంసలు ఒకెత్తు అయితే... 24 అసెంబ్లీ, 3 లోక్ సభ టిక్కెట్లు మాత్రమే తీసుకోవడంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. దీంతో... జనసేన నాయకత్వ లోపం అనే అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
అవును... తాజాగా తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తాను 24 సీట్లు తీసుకోవడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారని.. తనకు సలహాలు ఇచ్చ్చేవారు అవసరం లేదని.. యుద్ధం చేసేవాళ్లు కావాలని అన్నారు. అయితే "ఆ యుద్ధం చేయడానికి సైన్యం 24 మంది సరిపోతారా..?" అనేది ప్రశ్న అయితే... సరిపోరనేది సలహాలిచ్చేవారి సమధానం అనేది కొంతమంది వాదన!
ఇదే సమయంలో తనకు సలహాలిచ్చే వారికి వైఎస్ జగన్ ఎలాంటి వాడో తెలుసా అంటూ ప్రశ్నించిన పవన్... తాను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తనకు తెలుసని.. మర్చిపోవద్దని అంటూ సలహాలు ఇస్తున్న వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా ఒకెత్తు అయితే... తన స్థాయిని తగ్గించుకుంటూ.. జనసేన స్థాయిని తక్కువచేస్తూ.. ఆ పార్టీ నాయకత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇందులో భాగంగా... జనసైనికులు సిద్ధంగా ఉన్నా.. ప్రజలు మనవైపు ఉన్నా.. ప్రతీ ఒక్కరినీ ఓటుకు తెచ్చే నాయకత్వం జనసేనకు ఉందా ఆలోచించండి.. అన్నీ అర్ధం చేసుకున్నాకే 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలతో సరిపెట్టుకుని పొత్తు పెట్టుకున్నానంటు పవన్ వ్యాఖ్యానించారు! దీంతో... "పొత్తు పెట్టుకున్నది ఒంటరిగా పోటీ చేయలేకా..?" అని మరో ప్రశ్న వేస్తున్నారు రాజకీయాలకు అతీతమైన పవన్ అభిమానులు! మరి రాష్ట్రాభివృద్ధి కోసం అని అన్నారు..? ఇంకో ప్రశ్న!
టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లకు అంగీకరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరికొంతమంది నేతలు, జన సైనికులు... పవన్ తీరుని ఎండగడుతున్నారు.. తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు.. టీడీపీ జెండా మోయించడానికా పార్టీ పెట్టింది అని ఫైరవుతున్నారు.
దీంతో... వీటికి సమాధానంగా స్పందించిన పవన్.. తనను ఎందుకు ప్రశ్నిస్తున్నారని అనడం గమనార్హం. ఇదే సమయంలో... నిజంగా తన మద్దతుదారులైతే తనను ప్రశ్నించొద్దని పవన్ గట్టిగానే ఇచ్చిపడేశారు. అయితే "ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమే ప్రశ్నించడం.. 24 సీట్ల కోసం 151 నియోజకవర్గాల్లో పక్క పార్టీ జెండా మోయమంటే ప్రశ్నించొద్దా..?" అనే మరో ప్రశ్న సంధిస్తున్నారు పలువురు జనసైనికులు!