అసెంబ్లీ గేటూ...పవన్ మాటల ఘాటూ !
ఎమ్మెల్యే సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అంటూ బాలయ్య గర్జించిన డైలాగ్ తెర మీద ఒక రేంజిలో పేలింది.
ఏపీ అసెంబ్లీ గేటు అపుడెపుడో బాలయ్య లెజెండ్ సినిమాలో పంచ్ డైలాగ్ గా వచ్చి కేక పుట్టించింది. ఎమ్మెల్యే సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అంటూ బాలయ్య గర్జించిన డైలాగ్ తెర మీద ఒక రేంజిలో పేలింది. అంతే కాదు అది పొలిటికల్ గా పాపులర్ అయింది.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విపక్షంలో ఉన్నపుడు వైసీపీ నాయకులు ఈ డైలాగ్ ని పెద్ద ఎత్తున వాడేవారు. పవన్ ని అసెంబ్లీ గేటు తాకనివ్వమని చాలెంజ్ కూడా చేసేవారు. ఆయన ఈ జన్మకు ఎమ్మెల్యే కారని కూడా జోస్యాలు చెప్పారు.
అయితే వాటిని పూర్తిగా తొక్కేస్తూ పవన్ ని అసెంబ్లీకి జనాలు భారీ ఆధిక్యతతో పంపించారు. అంతే కాదు జనసేన పార్టీకి చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించారు. సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన రికార్డు బద్ధలు కొట్టింది.
పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పవర్ ఫుల్ శాఖలతో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తాజాగా పర్యటించారు. ఈ సందర్భంగా ఉప్పాడ తీరాన్ని సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను తెలుస్కున్న్నారు.
ఈ సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనను అసెంబ్లీ గేటుని కూడా తాకనివ్వను అని అన్నారు. కానీ తాకడమే కాదు బద్దలు కొట్టుకుని వెళ్ళామని అన్నారు. జనసేన సత్తా అలా చాటామని అన్నారు.
తాను ఇక మీదట పిఠాపురం వాస్తవ్యుడనని పవన్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో మూడు ఎకరాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెప్పారు. తొందర్లోనే తన సొంత ఇల్లు నిర్మించుకుంటానని ప్రజలకు అందుబాటులో ఉంటానని పవన్ చెప్పారు.
తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల ముందు ఆయన మరోసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అన్ని వర్గాల వారికీ హామీ ఇస్తున్నానని ఆయన అంటూ తాను ఎప్పటికీ లంచాలు తీసుకోనని ప్రజలకు మేలు చేయడానికే ఈ అధికారాన్ని ఉపయోగిస్తాను అని అన్నారు.
తాను కోరి మరీ పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నాను అని పవన్ అన్నారు. గ్రామాలను అభివృద్ధి అప్ధంలో నడిపించాలన్నదే తన కోరిక అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ మీద ఆయన సెటైర్లు వేశారు. 151 సీట్లు ఉన్న వైసీపీని 11కు కుదించారని అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఉన్న బలం అన్నారు.
జగన్ రుషికొండ లో ఆరు వందల కోట్లతో ప్యాలెస్ కట్టడం అవసరమా అని పవన్ ఫైర్ అయ్యారు. అంత పెద్ద మొత్తంతో ఏపీలో అనేక నియోజకవర్గాలను అభివృద్ధి చేయవచ్చు అని పవన్ అన్నారు. సినిమా రంగంలో కోట్లు సంపాదించే తాను కూడా రుషికొండ లో ఉన్నట్లుగా బాత్ రూం కట్టుకోలేదని పవన్ జగన్ తీరుని పట్టుకుని పూర్తి స్థాయిలో ఎద్దేవా చేశారు.