పవన్ గెలిచినా.. అధికారిక పత్రం చేతికి రాలేదా?
ఎన్నికల్లోగెలుపు కాస్త ఆలస్యమైనా.. లేటుగా అయినా లేటెస్టుగా వచ్చినట్లైందని చెప్పాలి.
ఎన్నికల్లో గెలవటం చేతకాదు. అసెంబ్లీ గేటు వద్దకు కూడా రానివ్వం. పెద్ద పెద్ద మాటలు తర్వాత, మొదట ఎన్నికల్లో గెలిచి చూపమని చెప్పండి.. ఇలా చెప్పుకుంటూ పోతే జనసేనాని పవన్ కల్యాణ్ ఎదుర్కొన్న ఎటకారాలు.. వ్యంగ్య వ్యాఖ్యలకు కొదవ లేదు. ఇప్పుడు ఆయన్ను మాట అనే అవకాశం లేదనే చెప్పాలి. సాధారణంగా రాజకీయ పార్టీలకు సాధ్యం కాని గెలుపును ఆయన సొంతం చేసుకున్నారు. తాను పోటీ చేసిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించటం చూస్తే.. వావ్ అనకుండా ఉండలేరు. వంద శాత స్ట్రైకింగ్ రేటుతో దూసుకెళ్లారు. ఎన్నికల్లోగెలుపు కాస్త ఆలస్యమైనా.. లేటుగా అయినా లేటెస్టుగా వచ్చినట్లైందని చెప్పాలి.
గత ఎన్నికల్లో మాదిరి రెండు చోట్ల పోటీ చేయకుండా.. పిఠాపురం ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే ఎంపిక చేసుకున్న పవన్.. తన పూర్తి ఫోకస్ ఆ నియోజకవర్గం మీదనే పెట్టారు. అంతేకాదు.. తాను పోటీ చేసే స్థానంతో పాటు.. తాను టికెట్లు ఇచ్చిన అందరిని గెలిపించేందుకు శ్రమించారు. అనుకున్నట్లే తాను గురి పెట్టిన లక్ష్యాన్ని చేర్చుకోవటంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు.. పిఠాపురంలో పవన్ గెలుపు అంత ఈజీ కాదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థుల ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న రీతిలో మంచి మెజార్టీని సొంతం చేసుకున్నారు.
ప్రత్యర్థి అభ్యర్థి కంటే మెరుగైన స్థాయిలో ఓట్లను సొంతం చేసుకున్న పవన్.. నియోజకవర్గంలో తన సత్తా చాటారు. పవన్ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరని.. ఆయన ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉంటారని.. పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండరని.. అప్పుడు ఇబ్బందులు ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే.. పిఠాపురంలో తాను ఇంటిని ఏర్పాటు చేసుకోవటతో పాటు.. ప్రజలకు అందుబాటులో ఉంటానన్న భరోసాను ఇచ్చేవారు పవన్. అందుకు తగ్గట్లే ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తాజాగా వెల్లడైన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాన్ని చూస్తే.. ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓటమి పాలు కావటమే కాదు.. మొత్తం 18 రౌండ్లలో ఒక్క రౌండ్ లోనూ అధిక్యతను ప్రదర్శించలేకపోయారు. అందుకు భిన్నంగా పవన్ మాత్రం ప్రతి రౌండ్ లోనూ తన అధిక్యతను ప్రదర్శిస్తూ.. మెజార్టీని మెరుగుపుర్చుకుంటూ దూసుకెళ్లారు. ఆయనకు 1,32,725 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు 63,556 ఓట్లు మాత్రమే దక్కాయి.
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు.. పిఠాపురం మండలాలు.. పిఠాపురం మున్సిపాలిటీ.. గొల్లప్రోలు నగర పంచాయితీల్లో పవన్ అత్యధిక మెజార్టీని సాధించారు. అదే సమయంలో కొత్తపల్లి మండలంలో మాత్రం స్వల్ప మెజార్టీ మాత్రమే లభించింది.ఓట్ల లెక్కింపు వేళ.. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ లేకపోవటం తెలిసిందే. ఫలితాలు వెల్లడయ్యే వేళలో హైదరాబాద్ లో ఉన్న ఆయన.. ఆ తర్వాత మంగళగిరి వెళ్లటం తెలిసిందే. దీంతో.. గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి తీసుకోలేదు. కాస్త సమయం చిక్కిన తర్వాత ఎన్నికల అధికారులు ఇచ్చే డిక్లరేషన్ ను అందుకోవాల్సి ఉంది.