ఎర్ర చందనం మాట ఎత్తినంతనే పవన్ ను టార్గెట్ చేస్తున్నట్లు?

అటవీ శాఖ రివ్యూలో భాగంగా ఎర్రచందనం మీద ఫోకస్ పెట్టినంతనే..పలువురు వైసీపీ నేతలు మైకుల ముందుకు వస్తున్నారు. పవన్ ను విమర్శించే వారు కొందరైతే.. మరికొందరు చర్యల సవాళ్లు విసురుతున్నారు.

Update: 2024-07-07 08:30 GMT

మంత్రిగా తనకు కేటాయించిన శాఖపై సమీక్ష జరపటం మామూలే. కానీ.. తన పోర్టుఫోలియోలో ఉన్న మంత్రిత్వశాఖకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కం అటవీ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కల్యాణ్ తాజా తీరు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న పరిస్థితి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినంతనే తాను చేపట్టిన పలు శాఖలకు సంబంధించిన రివ్యూలను ఒకటి తర్వాత ఒకటి చొప్పున చేస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పంచాయితీరాజ్ శాఖ మీద రివ్యూ చేసి.. వేలాది కోట్లు లేకపోవటంపై పవన్ మాట్లాడితే.. ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత మాట్లాడకుండా మౌనంగా ఉన్న పరిస్థితి. ఆయన సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారే లేకుండా పోయారు. కట్ చేస్తే.. ఇదే పవన్ కల్యాణ్.. అటవీ శాఖ మీద రివ్యూ పెట్టినంతనే ఆయనపై విరుచుకుపడుతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.

అటవీ శాఖ రివ్యూలో భాగంగా ఎర్రచందనం మీద ఫోకస్ పెట్టినంతనే..పలువురు వైసీపీ నేతలు మైకుల ముందుకు వస్తున్నారు. పవన్ ను విమర్శించే వారు కొందరైతే.. మరికొందరు చర్యల సవాళ్లు విసురుతున్నారు. మరికొందరు.. ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది చెప్పి.. వాటి గురించి పవన్ అవగాహన పెంచుకోవాలన్న ఉపదేశాన్ని ఉచితంగా ఇచ్చేస్తున్నారు. అయితే.. వారంతా మరచిపోతున్న అంశం ఏమంటే.. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టటం.. సరిహద్దులు దాటేసిన దుంగల్ని వెంటనే వెనక్కి తెచ్చే అంశాన్ని అధికారులతో చర్చించారు.

ఈ అంశంపై ఇప్పటికే చర్యల్ని షురూ చేసిన పవన్ వ్యవహారం వైసీపీ నేతల్లో పలువురికి ఇరిటేషన్ ను తెప్పిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు తగ్గట్లే మీడియా ముందుకు.. సోషల్ మీడియాలోనూ ఎర్రచందనం మీద పవన్ ఏమీ చేయలేదంటూ విరుచుకుపడుతున్నారు. సరిగ్గా నెల రోజులు కూడా కాకుండానే ఇప్పటికే చర్యల కత్తిని సాన పెడుతున్న పవన్ తీరు భయాందోళనలకు గురి చేస్తోందని.. దాని పర్యవసానమే ఇంతలా పవన్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా వంగా గీత సైతం సవాలు విసిరారు.

మంత్రి పవన్ విషయానికి వస్తే.. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మిథున్ రెడ్డిలు ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లుగా సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన వంగా గీత.. అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంది కదా? విచారణ చేసి నిజాలు తేల్చాలంటూ సవాలు విసిరారు. వంగ గీత సవాలు విసరటం బాగానే ఉంది. కానీ ఆమె గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమంటే... మంత్రిగా బాధ్యతు స్వీకరించిన పవన్ కు ఆర్నెల్ల టైమిచ్చి... అప్పటికి ఆయన ఏమీ చేయకపోతే మాట్లాడాలే కానీ.. రివ్యూ చేసి.. మాటలాడినంతనే మైకుల్ని సర్దుకొని మాట్లాడటంలో అర్థం లేదన్న విషయాన్ని ఆమె ఎప్పటికి గుర్తిస్తారో?

Tags:    

Similar News