మాట నిలబెట్టుకున్న పవన్...ఆయనకే టికెట్ ...!

నిజానికి ఈ టికెట్ ని వంశీకి ఇస్తారు అని చాలా రోజులుగా ప్రచారం సాగింది. అదే విధంగా చూస్తే వంశీకి ప్రచారం చేసుకోమని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

Update: 2024-03-31 11:16 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నారు. అధికారంలో ఉన్న వైసీపీని ఇంకా నాలుగేళ్ళ ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని వదులుకుని జనసేనలో చేరినందుకు గానూ విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ని వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి కేటాయించారు.

నిజానికి ఈ టికెట్ ని వంశీకి ఇస్తారు అని చాలా రోజులుగా ప్రచారం సాగింది. అదే విధంగా చూస్తే వంశీకి ప్రచారం చేసుకోమని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. వంశీ కూడా ఆఫీసుని ఓపెన్ చేసుకుని ప్రచారం చేపట్టారు. అయితే లోకల్ గా ఉన్న లీడర్స్ మాత్రం వంశీ అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

వంశీని మార్చాల్సిందే అని వారు డిమాండ్ చేశారు. దీంతో వంశీ సీటు మీద డైలమా అలా కంటిన్యూ అయింది. వంశీ విషయంలో పవన్ కళ్యాణ్ ఏమి నిర్ణయం తీసుకుంటారో అంతా ఆసక్తిగా చూశారు. ఇంతలో ఆయన విశాఖలో మూడు పొత్తు టికెట్లు ప్రకటించేశారు. సౌత్ మాత్రం అలా పెండింగులో ఉంచేశారు

దాంతో కొత్త క్యాండిడేట్ కే టికెట్ ఇస్తారు అని కూడా అంతా అనుకున్నారు. కానీ ఇటీవల వంశీని పిలిపించుకుని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆయనకే టికెట్ అని మరోసారి భరోసా ఇచ్చారు. ఆ విధంగా వంశీని మార్చరు అని క్లారిటీ వచ్చింది. ఇక ఆదివారం వంశీకి టికెట్ ఇస్తున్నట్లుగా జనసేన ఆఫీసు నుంచి కీలక ప్రకటన వెలువడింది.

దీంతో వంశీ వర్గీయులు ఊపిరిపీల్చుకున్నారు వంశీ వర్గం అయితే తమ నాయకుడు ఇక ఎమ్మెల్యే అయినట్లే అని అంటున్నారు. విశాఖ సౌత్ లో కూటమి గెలిచేందుకు స్కోప్ అయితే ఉంది. కానీ టీడీపీ జనసేనలలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో మొదట్లో ఏర్పడింది. టీడీపీ సౌత్ ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టికెట్ దక్కనందుకు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు.

అయితే ఇటీవల కాలంలో ఆయన మళ్ళీ పార్టీలో చేరారు. ఆయనకు ఏకంగా విశాఖ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ పదవిని కూడా ఇచ్చారు. దాంతో ఆయన హుషార్ చేస్తున్నారు. జనసేన నేతలకు కూడా ఈ మధ్యలోనే నచ్చచెప్పారు అని అంటున్నారు. దాంతో వారంతా సైలెంట్ అయ్యారు అని అంటున్నారు.

ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీద వ్యతిరేకత ఉంది. కూటమిలో లుకలుకలు ఉంటే కనుక ఆయనకు ఎంతో ఉపయోగపడుతుందని అంతా భావించారు. ఇపుడు చూస్తే కూటమి అంతా ఒక్క త్రాటి పైకి వచ్చినట్లుగానే ఉంది.

వంశీ గురించి చూస్తే ఆయన విశాఖ తూర్పు నుంచి 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన ఆ ఎన్నికల్లో మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఆయన విశాఖ తూర్పు నుంచి 2014లో మరోసారి పోటీ చేశారు. ఈసారి వైసీపీ తరఫున పోటీ చేస్తే 47 వేలకు పైగా భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు.

ఇక 2019లో ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. 2021లో ఆయనను ఎమ్మెల్సీగా చేశారు. అయితే 2024లో టికెట్ ఇస్తామని నాడు హామీ ఇచ్చారని అంటారు. కానీ ఆ టికెట్ ని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఇవ్వడంతో వంశీ పార్టీ మీద ఆగ్రహం చెంది జనసేనలో చేరారు. దీంతో ఆయన పదేళ్ల తరువాత మరోసారి పోటీ చేస్తున్నట్లు అయింది. ఈసారి ఆయన పోటీ చేసేది తూర్పు కాదు, విశాఖ సౌత్.

అయితే ఆయన వైసీపీలో విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేశారు. దాంతో ఆయనకు సిటీ అంతా పరిచయాలు ఉన్నాయి. దాంతో పాటు బీసీలు ఎక్కువగా ఉండే విశాఖ సౌత్ లో కనుక వంశీకి ఆదరణ లభిస్తే ఆయన గెలిచి మొదటి సారి ఎమ్మెల్యే అవుతారు. అలా తన చిరకాల కోరిక తీర్చుకున్న వారు అవుతారు మరి వంశీ రాజకీయ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాల్సిందే. వివాద రహితుడుగా ఆయనకు పేరుంది. ఆయన ఎమ్మెల్యే అయితే చూడాలని అనుకునే వారు రాజకీయాలకు అతీతంగా ఉన్నారు. అదే ఆయనకు ప్లస్ అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News