వారాహియాత్రకు బ్రేక్

రాజకీయంగా బాగా వేడి పెరిగిపోతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రకు బ్రేక్ ఇచ్చారు

Update: 2023-10-09 07:05 GMT

రాజకీయంగా బాగా వేడి పెరిగిపోతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రకు బ్రేక్ ఇచ్చారు. తన యాత్రలతో వేడిని ఇంకా అంతకంతకు పెంచేయాల్సిన పవన్ సడెన్ గా వేడిపై నీళ్ళు చల్లేశారు. ఎందుకంటే దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిదేమో సినిమా షూటింగుల్లో ఫుల్లు బిజీగా ఉండటం. ఇక రెండోదేమో అన్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ వివాహం. వరుణ్ వివాహం నవంబర్ 1వ తేదీన ఇటలీలో జరగబోతోంది.

ఇటలీలో జరగబోయేది డెస్టినేషన్ వివాహం కాబట్టి దానికి హాజరుకాక తప్పదు. కాబట్టి ఇటలీకి పవన్ వెళ్ళటాన్ని ఎవరు తప్పపట్టరు. మరి షూటింగుల మాటేమిటి ? మిత్రపక్షం అధినేత చంద్రబాబునాయుడు స్కిల్ స్కామ్ లో అరెస్టయి జైలులో ఉన్నారు. ఇలాంటి సమయంలో రెండుపార్టీల తరపున పవనే యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. అనుకున్నట్లుగానే కృష్ణాజిల్లాలో వారాహియాత్ర మొదలుపెట్టినా మూడురోజులకే ఎందుకో ముగించేశారు.

రాష్ట్రవ్యాప్తంగా తన యాత్రలతో ఎన్నికల వేడి పెంచేయాల్సిన పవన్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు మరో ఏడు నెలల్లోకి వచ్చేసినా ఇంకా సినిమా షూటింగుల్లోనే బిజీగా ఉంటే పార్టీ నిర్వహణ ఎలాగ ? జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తుందో ఎవరికీ తెలీదు. పోటీచేయబోయే నియోజకవర్గాలేవో కూడా పార్టీ నేతల్లో క్లారిటిలేదు. నియోజకవర్గాల సఖ్యను, పోటీచేయబోయే నియోజకవర్గాలను ఎప్పుడు ప్రకటిస్తారో తెలీక నేతలంతా అయోమయంలో పడిపోతున్నారు.

టీడీపీ, జనసేన పార్టీల పొత్తుకు జనామోదం లభించాలంటే పవన్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించటం ఒక్కటే మార్గం. ఎందుకంటే చంద్రబాబు జైలులో ఉన్న కారణంగా రెండుపార్టీల తరపున ప్రచార బాధ్యతలను తీసుకోవాల్సింది పవన్ మాత్రమే. అయినా పవన్ కు సీరియస్ నెస్ అర్ధం అవుతున్నట్లు లేదు. అందుకనే సినిమా షూటింగుల్లోనే బిజీగా ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే జనసేన దెబ్బతినటంతో పాటు పొత్తు పెట్టుకున్నందుకు టీడీపీ కూడా నష్టపోవటం ఖాయం. తెలంగాణా ఎన్నికల షెడ్యూల్ సోమవారం ప్రకటించే అవకాశాలున్నాయనే ప్రచారం పెరిగిపోతోంది. తెలంగాణాలో షెడ్యూల్ ప్రకటించేస్తే ఏపీలో కూడా ఆలోమేటిక్కుగా ఎన్నికల వేడి పెరిగిపోవటం ఖాయం. కాబట్టి పవన్ ఇప్పుడైనా సీరియస్ నెస్ అర్ధం చేసుకుంటే బాగుంటుంది.

Tags:    

Similar News