కేంద్రంతో కలసి జగన్ ఆట కట్టిస్తా...పవన్ పవర్ ఫుల్ వార్నింగ్

విశాఖలోని జగందాంబా జంక్షన్ వద్ద జరిగిన భారీ సభలో పవన్ కళ్యాణ్ జగన్ మీద ఎన్నడూ లేని స్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2023-08-10 15:15 GMT

విశాఖలో మూడవ విడత వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకున్న విధంగానే పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. జగన్ని కేంద్రంగా చేసుకుని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసారు. కొన్ని సందర్భాలలో సవాల్ చేశారు. మరికొన్ని సందర్భాలలో భారీ హెచ్చరికలూ జారీ చేశారు. మొత్తానికి విశాఖ నుంచి జనసేనాని వైసీపీ ప్రభుత్వానికి జగన్ కి గట్టి సందేశమే పంపించారు అని చెప్పాలి.

విశాఖలోని జగందాంబా జంక్షన్ వద్ద జరిగిన భారీ సభలో పవన్ కళ్యాణ్ జగన్ మీద ఎన్నడూ లేని స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నాళ్ళూ జగన్ మీద విమర్శలు మాత్రమే చేస్తూ వస్తున్న పవన్ ఈసారి మాత్రం యాక్షన్ లోకి దిగుతున్నట్లుగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద వైసీపీ అవినీతి చిట్టా ఉందని సంచలన కామెంట్స్ చేశారు.

కేంద్ర హోం మంత్రి విశాఖ వచ్చి వైసీపీ ప్రభుత్వ అవినీతి గురించి చెప్పారని అన్నారు. తాను కూడా కేంద్రం సాయంతో జగన్ కట్టిస్తాం అని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తోందని అన్నారు. ఆ ఫైల్ కేంద్రం దగ్గర ఉందని పవన్ చెప్పుకొచ్చారు. ఇలా మైనింగ్ అక్రమంగా చేస్తున్న ఎమ్మెల్యేల చిట్టా కూడా కేంద్రం వద్ద ఉందని కొత్త విషయాన్ని పవన్ చెప్పారు.

విశాఖ జిల్లాలోనే మైనింగ్ కుంభకోణాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే కేంద్రం ఇచ్చిన నిధులతో పనులు చేస్తూ దానికి జగన్ తన సొంత బొమ్మ వేసుకుంటున్నారు అని విమర్శించారు. విశాఖలో పాతిక వేల కోట్ల విలువ చేసే ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీ ప్రభుత్వం అని పవన్ ఆరోపించారు.

ఇక దేశంలోనే పేరెన్నిక కలిగిన ఏయూ పూర్తిగా భ్రష్టు పట్టిందని ర్యాకులు లేక దిగజారిపోయిందని పవన్ విమర్శించారు. ఏకంగా క్యాంపస్ లో సెక్యూరిటీయే గంజాయి ని అమ్ముతున్నారని పవన్ ఆరోపించడం విశేషం. ఏయూ వీసీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించడానికి చూడడం దారుణం అని పవన్ అన్నారు. జనసేన అధికారంలోకి వచ్చాక ఏయూని పూర్తిగా ప్రక్షాణల చేస్తామని పవన్ చెప్పారు.

వాలంటీర్లు అంటే తనకు ద్వేషం లేదని పవన్ అంటూ వారి చేత జగన్ తప్పులు చేయిస్తున్నారు అని అన్నారు. వాలంటీర్లు ప్రజల నుంచి సేకరించిన డేటా అంతా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ సంస్థకు వెళ్తోంది అని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్లలో కొందరు ఘోర అఘాయిత్యాలను పాల్పడుతున్నారని, విశాఖలో ఒక మహిళ గొంతును వాలంటీర్ కోశాదని ఆయన అన్నారు.

అలాగే కొందరు వాలంటీర్లు యువతులను అత్యాచారాలు చేయడానికి యత్నించారని అన్నారు. ఇంకొందరు మహిళల నుంచి డబ్బులు కాజేశారని, రేషన్ రాలేదని అడిగితే ఇళ్ళు తగలెట్టారని కూడా పవన్ ఆరోపించారు. అలాంటి వాలంటీర్ల విషయంలోనే తాను వ్యతిరేకం తప్ప అందరి విషయంలో కాదని అన్నారు. తనకు వీలు ఉంటే వాలంటీర్ల జీతం మరో అయిదు వేలు పెంచుతాను అని ఆయన అన్నారు. జగన్ని గుడ్డిగా వాలంటీర్లు నమ్మవద్దని ఆయన హెచ్చరించారు.

ఇక మహిళల మిస్సింగ్ కేసులలో విశాఖ అగ్రస్థానంలో ఉందని ఆయన అన్నారు.ఇదే మాటను కేంద్ర మంత్రి కూడా చెప్పారని పవన్ అన్నారు. ఇదిలా ఉంటే జగన్ మీద సరికొత్తగా తీవ్ర ఆరోపణలు పవన్ చేశారు. జగన్ని ఏకంగా వ్యాపారిగా అభివర్ణించారు. ఆయన వద్దకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే ఉద్యోగాలు యువతకు అడగకుండా తనకు ఎంత కమిషన్ అని అడుగుతారని నిందించారు.

జగన్ కి డబ్బు అన్నది ఒక పిచ్చిగా మారిందని, ఎంత డబ్బు తింటావు జగన్ ఏమి చేసుకుంటావు అంటూ పవన్ ఆవేశంగా ప్రశ్నించారు. మొత్తానికి విశాఖ సభలో జగన్ మీద పవన్ నిప్పులే కురిపించారు. పవన్ స్పీచ్ అంతా జగన్ నే టార్గెట్ చేస్తూ సాగడం విశేషం. జగన్ని వైసీపీని ఓడించి ఏపీని కాపాడుతామని పవన్ శపధం చేయడం విశేషం.

Tags:    

Similar News