బడ్జెట్లో ఏం చేద్దాం.. కేశవ్ కష్టాలు చూశారా..!
ఏపీ బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేపట్టారు.
ఏపీ బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేపట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కేటాయింపులు, వివిధ శాఖల నుంచి వచ్చే డిమాండ్లు వంటివాటిని ఇప్పటికే సేకరించారు. ప్రధానంగా `సూపర్ సిక్స్` విషయంపై లోతైన కసరత్తు చేస్తున్నారు. అయితే.. రాష్ట్ర బడ్జెట్లో ఏం చేయాలన్న దానిపై.. శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి.
రాష్ట్రంలో చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు 12500 కోట్లను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నిధులను కొంత మేరకు విడుదల చేసింది. కానీ.. ప్రాజక్టు నిర్మాణాన్ని 2028-29 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం గా నిర్దేశించుకున్న నేపథ్యంలో ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో కూడా పోలవరానికి నిధులు ఇవ్వాలని రాష్ట్రం కోరింది. ఒకవేళ పోలవారినికి నిధులు ఇవ్వకపోతే.. రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు పెంచాల్సి ఉంటుంది. ఆ దిశగా పయ్యవుల ప్రయత్నం చేస్తున్నారు.
ఇక, అమరావతికి సంబంధించి గత బడ్జెట్లో కేంద్రం 15 వేల కోట్లను ప్రకటించినా.. అవి అప్పులే. సో.. ఇప్పుడు అలా కాకుండా కనీసంలో కనీసం 10 వేల కోట్లయినా అమరావతికి ఇవ్వాలని చంద్రబాబు స్వ యంగా ఇటీవల నిర్మలా సీతారామన్‌ను కోరారు. తద్వారా.. రాజధాని నిర్మాణాలు పరుగులు పెడతాయని బాబు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించాల్సి ఉంది. ఒక వేళ అలా చేయకపోతే.. మంత్రి కేశవ్ ఆ భారాన్ని బడ్జెట్లో చూపించాలి.
ఈ రెండు ప్రాజెక్టులు ఇలా ఉంటే.. సూపర్ సిక్స్‌లో కీలకమైన మాతృవందనం, రైతు భరోసాకు(2025-26), ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాలు వంటి కీలక పథకాలకు బడ్జెట్లో పద్దు చూపించాల్సి ఉంటుంది. అయితే.. వీటిని ఇప్పటికిప్పుడు తేల్చే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో ఇంకా సంపద సృష్టి ఆశించిన మేరకు జరగకపోవడంతోపాటు.. జీతాలు, భత్యాలు, పింఛన్లకే సొమ్ములు సరిపోతుండడంతో బడ్జెట్ కూర్పుపై కేశవ్‌కు కష్టాలు మామూలుగా లేవన్న వాదన వినిపిస్తోంది. చివరకు ఏం చేస్తారో చూడాలి.