పీఏసీ ఎలక్షన్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

అయితే కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోందని.. అందుకే, ఈ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని పెద్దిరెడ్డి తెలిపారు.

Update: 2024-11-22 09:35 GMT

తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (ఏపీసీ) ఛైర్మన్ పదవికి ఎన్నిక జరగబోతోందని.. తగిన సంఖ్యా బలం లేదని చెబుతూ.. 1966 నుంచి వస్తోన్న సంప్రదాయానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమయంలో పెద్దిరెడ్డి స్పందించారు.

అవును... రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి ఎనికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెలే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరుపున ఆయన ప్రకటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఇప్పటివరకూ ప్రతిపక్షానికి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని.. అయితే కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోందని.. అందుకే, ఈ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారని గుర్తు చేశారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుందని.. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారని.. ప్రపంచంలోని ప్రతీ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇదే సంప్రదాయం జరుగుతుందని.. ఒక తాలిబాన్లు పాలిస్తున్న ఆఫ్గన్ లో తప్ప అని పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2జీ స్పెక్ట్రం స్కాం దగ్గర నుంచి కోల్ గేట్ స్కాం వరకూ అన్నీ పీఏసీ వెలికితీసినవే అని తెలిపారు.

1994లో ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారని... ఇలా ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా గతంలో ఎన్నోసార్లు పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారని.. పార్లమెంట్ లో సైతం ఇలాంటి పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయని పెద్దిరెడ్డి గుర్తుచేశారు.

ఇదే క్రమంలో... గతంలో 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నా కూడా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కే పీఏసీ ఛైర్మన్ ఇచ్చామని గుర్తు చేసిన పెద్దిరెడ్డి.. ఇప్పుడు మాత్రం ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమని అన్నారు.

Tags:    

Similar News