జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్... తెరపైకి కొత్త చర్చ!
తాజాగా మరోసారి పెగాసస్ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఇండియన్ జర్నలిస్ట్ ల ఫోన్ లలో ఫెగాసస్ స్పైవేర్ ఉన్నట్లు కీలక విషయం తెరపైకి వచ్చింది.
కొంతకాలం క్రితం దేశవ్యాప్తంగా పెగాసస్ స్పైవేర్ వార్తలు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాల్లో అధికార, విపక్షాలు ఈ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ ఉదంతంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. అయితే అనంతర కాలంలో వీటి తాలూకు చర్చ కాస్త తగ్గినట్లు కనిపించిన నేపథ్యంలో... తాజాగా మరోసారి పెగాసస్ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఇండియన్ జర్నలిస్ట్ ల ఫోన్ లలో ఫెగాసస్ స్పైవేర్ ఉన్నట్లు కీలక విషయం తెరపైకి వచ్చింది.
అవును... గతంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... అక్టోబర్ లో యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్ లు వచ్చిన అనంతరం ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగసస్ స్పైవేర్ ను గుర్తించినట్లు ఎన్.జీ.వో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
ఇందులో ప్రధానంగా... "ది వైర్" పత్రిక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజ్ సహా మరో జర్నలిస్టు ఫోన్లను తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షించగా.. వాటిల్లో పెగసస్ ఉన్నట్లు తేల్చిందని వెల్లడించింది.
వాస్తవానికి అక్టోబర్ లో పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు యాపిల్ సంస్థ నుంచి హ్యాకింగ్ అలర్ట్ లు వచ్చాయి. ప్రభుత్వ మద్దతుతో జరిగే హ్యాకింగ్ కు వీరి ఫోన్లు లక్ష్యంగా మారినట్లు సందేశాలు వచ్చాయి. ఆ తర్వాత దీనిపై వివరణ ఇచ్చిన యాపిల్... సుమారు 150 దేశాలకు ఇటువంటి సందేశాలు వెళ్లాయని చెప్పింది.
హ్యాకింగ్ సందేశాలు వచ్చిన అనంతరం తమ ఫోన్లను అమ్నెస్టీ ల్యాబ్ కు పంపించారు ఇండియన్ జర్నలిస్టులు. దీంతో ఈ విషయాలపై స్పందించిన అమ్నెస్టీ సెక్యూరిటీ ల్యాబ్ అధిపతి డాన్చా ఓ సియార్బైల్... జర్నలిస్టులు వారి విధులు నిర్వర్తిస్తున్నందుకు చట్టవిరుద్ధంగా వారి వ్యక్తిగత గోప్యత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేస్తున్నారని అన్నారు. తమ ప్రజలను చట్టవిరుద్ధ నిఘా నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందని పేర్కొన్నారు.
కాగా... ఇజ్రాయెల్ కు చెందిన ఎన్.ఎస్.వో. గ్రూప్ రూపొందించిన పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ఆ సంస్థ ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది. ఈ క్రమంలో 2017లో ఎన్.ఎస్.వో నుంచి భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కొన్ని పరికరాలను కొనుగోలు చేసింది. ఈ సమయంలో 2021 జులైలో అంతర్జాతీయ మీడియాలో ఈ స్పైవేర్ వాడకంపై కథనాలు రావడం తీవ్ర దుమారానికి దారితీసింది.
ఇజ్రాయెల్ కు చెందిన ఎన్.ఎస్.వో. గ్రూప్ రూపొందించిన ఈ స్పైవేర్ ను కొన్ని దేశాలు వినియోగించుకుని.. రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు ఆ కథనం వెల్లడించింది. దీంతో... భారత్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, సహా దేశవ్యాప్తంగా సుమారు 300 మంది ఫోన్లను పెగాసస్ తో హ్యాక్ చేసినట్లు కథనాలొచ్చాయి.
దీంతో... ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఇదే సమయంలో పార్లమెంట్ ను కూడా ఈ వ్యవహారం కుదిపేసింది. తర్వాత కొంతకాలం ఈ విషయంపై చర్చ తగ్గినా... తాజాగా మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇండియన్ జర్నలిస్టుల ఫోన్ లలో పెగాసస్ అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.