షాకింగ్ గా చైనా ఆర్మీ బలం... పెంటగానే హాట్ రిపోర్ట్!

ఈసారి ప్రపంచ యుద్ధం వస్తే ఆ బలం ఉన్న ప్రతీ దేశమూ అణ్వాయుదాలనే ప్రాధమికంగా ప్రయోగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుంటారు.

Update: 2023-10-22 23:30 GMT

ఈసారి ప్రపంచ యుద్ధం వస్తే ఆ బలం ఉన్న ప్రతీ దేశమూ అణ్వాయుదాలనే ప్రాధమికంగా ప్రయోగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుంటారు. అందుకే మూడో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే ఏ యుద్ధమైనా కర్రలతోనూ, కత్తులతోనూ పోట్లాడుకోవడామే అవుతుందని జోస్యం చెబుతుంటారు. అంటే... భూమిపై మనిషి మనుగడ రీస్టార్ట్ అవుతుందన్నమాట! ఆ సంగతి అలా ఉంటే భారత్ పొరుగున ఉన్న చైనా ఆయుధ సంపత్తిపై ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అవును... చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకొందని.. వీటి సంఖ్య రాబోయే ఏడెళ్లలో డబుల్ అయ్యే అవకాశం ఉందని, ఇదే సమయంలో నౌకాదళంలో సరికొత్త యుద్ధనౌకలను ఏర్పాటు చేసుకుంటుందని, వీటి సంఖ్య కూడా ఈ దశాబ్ధంలో రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అమెరికాకు చెందిన పెంటగాన్‌ వార్షిక నివేదిక వెల్లడించింది.

తాజాగా ఈ నివేదిక వెల్లడించిన విషయాల ప్రకారం... చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుందని, 2021తో పోలిస్తే వీటి సంఖ్య ఏకంగా 100 పెరిగినట్లు గుర్తించామని పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే... . చైనా వద్ద ఇప్పటివరకూ సుమారు 500 అణు వార్‌ హెడ్‌ లు వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయని.. వీటి సంఖ్య 2030 నాటికి 1,000కి చేరే అవకాశం ఉందని పెంటగాన్ అణుబాంబులాంటి సమాచారం వెల్లడించింది.

ఇదే క్రమంలో... ప్రస్తుతం చైనా ఆర్మీ వద్ద 300 ఖండాంతర క్షిపణులు భూగర్భ బొరియల్లో సిద్ధంగా ఉన్నాయని.. ఈ భూగర్భ బొరియలను 2022లో చైనా నిర్మించిందని.. దేశంలోని మూడు ప్రదేశాల్లో క్షిపణులు మోహరించడానికి వీలుగా ఈ బొరియలు ఏర్పాటు చేసిందని పెంటగాన్ పేర్కొంది. ఇదే సమయంలో సరిహద్దు దేశాలతోపాటు పలు దేశాల్లో లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని పెంటగాన్ నివేధిక అభిప్రాయపడింది.

ఇందులో భాగంగా... బంగ్లాదేశ్‌, బర్మా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌, కెన్యా, యూఏఈ, నైజీరియా, మొజాంబిక్‌, నమీబియా, సాల్మన్‌ ఐలాండ్స్‌, తజకిస్థాన్‌, పపువా న్యూగినియా వంటి చోట్ల లాజిస్టిక్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నౌకాదళం విషయంలో కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు సరికొత్త షిప్ లను నౌకాదళంలో చేర్చిందని చెబుతోంది.

తాజాగా నౌకాదళం విషయంలో డ్రాగన్ చేసుకున్న అప్ డేట్స్, తీసుకున్న నిర్ణయాలపైనా పెంటగాన్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... నౌకాదళంలో ఏడాది కాలంలో సుమారు 30 సరికొత్త షిప్‌ లను చేర్చిందని వెల్లడించింది. ఫలితంగా... ప్రపంచంలోనే అత్యధికంగా 370 యుద్ధనౌకలు ఉన్న దేశంగా చైనా రికార్డు కెక్కిందని చెబుతుంది.

ఇదే అమయంలో... సంఖ్య 2025 నాటికి 395.. 2030 నాటికి 435కు పెరగవచ్చని పెంటగాన్ నివేదిక అభిప్రాయపడింది. అదేవిధంగా... వాస్తవాధీన రేఖ వద్ద చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు పెంటగాన్‌ తన నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో డోక్లాం వద్ద కూడా అండర్‌ గ్రౌండ్‌ స్టోరేజీ ఫెసిలిటీలను ఏర్పాటు చేయడంతోపాటు.. భూటాన్‌ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతానికి సమీపంలో గ్రామాల నిర్మాణం చేపట్టిందని చెబుతున్నారు!

Tags:    

Similar News