దేశంలో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం... ఆందోళనకారుల అరెస్ట్!

వాస్తవానికి సుమారు గత ఏడాది కాలంగా ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

Update: 2024-11-01 09:55 GMT

భారతదేశంలో మరో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది! గత ఏడాది కాలంగా ఎక్కువవుతున్న నినాదాలు మరోసారి వినిపించాయి. ఈ మేరకు.. తాజాగా బ్యానర్లు పట్టుకుని, రోడ్లపై ర్యాలీగా బయలుదేరిన ఈ కొత్త రాష్ట్ర ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు!

అవును... కర్ణాటకలో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆందోళనలు మొదలయ్యాయి! ఇందులో భాగంగా... కలబుర్గిలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. దీంతో... ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నడ రాజోత్సవ రోజైన శుక్రవారం.. కళ్యాణ కర్నాటక ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు!

వాస్తవానికి సుమారు గత ఏడాది కాలంగా ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కన్నడ రాజోత్సవ రోజు కావడంతో తాజాగా ఈ "కల్యాణ కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర పోరాట సమితి" కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏ.ఎన్.ఐ. నివేదించింది.

కాగా... గత ఏడాది కూడా కన్నడ రాజోత్సవం రోజున కలబుర్గిలో ప్రత్యేక రాష్ట్ర నినాదం వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. కల్యాణ కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రత్యేక రాష్ట్ర సమితి సర్ధార్ వల్లభాయ్ పటేల్ సర్కిల్ వద్ద ఓ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేసింది.

అయితే... వీరిని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కన్నడ రాజోత్సవం రోజైన ఈ రోజు (1 నవంబర్) కూడా మరోసారి రోడ్లపైకి వచ్చి ర్యాలీ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో... మరోసారి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక, ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ కల్యాణ కర్ణాటక ప్రాంతంలో ప్రస్తుతం బీదర్, రాయిచూర్, యాద్గిర్, కలబుర్గి, బళ్లారి, విజయనగర, కొప్పల్ జిల్లాలు ఉన్నాయి!

Tags:    

Similar News