బంగారం గనిపై వివాదం.. 30 మంది మృతి.. ఆ అల్లర్లకు కారణమేంటి..?

బంగారు గనిపై నెలకొన్న వివాదం చివరకు కాల్పులకు దారితీసింది.

Update: 2024-09-17 00:30 GMT

బంగారు గనిపై నెలకొన్న వివాదం చివరకు కాల్పులకు దారితీసింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. ఇంతకీ ఈ వివాదం ఎందుకు నెలకొంది..? ఘర్షణ వాతావరణం ఎందుకు ఏర్పడింది..? ఈ ఘటన ఎక్కడ జరిగింది..? ఒకసారి తెలుసుకుందాం.

పపువా న్యూ గినియా అనే దేశంలో చోటుచేసుకున్న ఈ వివాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి పోలీసులు వివరించారు. దేశ మధ్య ప్రాంతంలోని పోర్‌గెరాలో బంగారు గని ఉంది. ఇది కెనడా జాతీయుడి యాజమాన్యం చేతిలో ఉంది. దీనిని గత ఆగస్టులో సకార్ తెగవారు ఆక్రమించారు. అప్పటి నుంచి అది వారి పరిధిలోనే ఉండిపోయింది. అయితే.. నిబంధనలు ప్రకారం ఈ భూమిపై పయాండె తెగ వారికి అధికారం ఉంది.

ఇదిలా ఉంటే.. ఆదివారం ఇరు తెగల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. ఏకంగా తుపాకీలతో దాడులకు పాల్పడ్డారు. 300 రౌండ్లకు పైగా జరిగిన ఈ కాల్పులు జరగడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. స్థానిక భవనాలకు నిప్పుపెట్టారు. యుద్ధ వాతావరణంతో ఆస్పత్రులు, ప్రభుత్వ ఆఫీసులను కూడా మూసివేశారు. అల్లర్ల కారణంగా గని సైతం మూతపడింది.

దీనిపై పపువా న్యూగినియా పోలీస్ కమిషనర్ డేవిడ్ మన్నోంగి మాట్లాడుతూ.. ఆక్రమణలు, అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయని అన్నారు. భూ యజమానులు, స్థానికులను భయపెట్టేందుకు ఈ దాడులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలతో తిరిగినే కాల్చి పడేస్తామని హెచ్చరించారు. మరో వైపు.. ఈ అల్లర్లను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్ అమ్మకాలు నిలిపివేసింది. రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు.

Tags:    

Similar News