ప్రపంచంలో బొద్దు బ్యాచ్ 100కోట్లు

అవును.. లావెక్కిపోతున్నారు. ప్రపంచంలో ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా అన్ని దేశాల ప్రజలు బొద్దుగా మారిపోతున్న సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

Update: 2024-03-02 04:40 GMT

అవును.. లావెక్కిపోతున్నారు. ప్రపంచంలో ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా అన్ని దేశాల ప్రజలు బొద్దుగా మారిపోతున్న సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అన్ని దేశాలతో కలిపి స్థూలకాయుల సంఖ్య 100కోట్లకు చేరుకున్న వైనం తాజాగా చోటు చేసుకుంది. ప్రపంచ గమనాన్ని చూస్తే 1990 వరకు ఒకలా.. ఆ తర్వాత మరోలా అన్నట్లుగా పరిస్థితుల్లో మార్పులు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. 1990 తర్వాత అంటే.. దాదాపు 33 ఏళ్లలో స్థూలకాయుల సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరిగిపోవటం గమనార్హం.

ఈ ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లోనూ పెరుగుతోంది. మారుతున్న లైఫ్ స్టైల్ తో పాటు.. ఆహార అలవాట్లు.. ఆధునిక జీవితపు ఒత్తిళ్లు.. పౌష్ఠికాహార లోపం కూడా లావు పెరిగిపోవటానికి కారణాలుగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికే పెద్దవాళ్లలో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటేసింది. టీనేజీ లోపు పిల్లల్లోనూ ఈ బొద్దు బ్యాచ్ ఎక్కువ అవుతుందని గుర్తించారు. టీనేజీ వయసు లోపు వారిలోనూ 16 కోట్లకు పైగా ఊబకాయంతో బాధ పడుతున్నట్లుగా గుర్తించారు.

1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. ఊబకాయుల జాబితాలో అమెరికా పురుషులు పదో స్థానంలో మహిళలు 36 స్థానంలో నిలిచారు. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాలో అనారోగ్యకర ఆహార అలవాట్లే ఈ ఊబకాయ సమస్యకు ప్రధాన కారణంగా తేల్చారు. తక్కువ బరువుతో బాధ పడుతున్ నవారి సంఖ్యలో 50 శాతం తగ్గుదల నమోదైంది. భారతదేశంలో ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్లుగా తేల్చారు.

ఒకప్పుడు పెద్దవాళ్లలో కనిపించే స్థూలకాయం.. ఇప్పుడు చిన్నారుల్లోనూ పెరిగిపోవటం ఆందోళన కలిగించే అంశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చిన్న వయసులోనే బరువు పెరిగే అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం.. నియమిత వ్యాయామాలు చేయటంతో పాటు జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తాజాగా చేసిన అధ్యయనాన్ని దాదాపు 1500 మందికి పైగా రీసెర్చర్లు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 190కు పైగా దేశాల నుంచి ఐదేళ్లకు పైబడిన 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు.. బరువు.. శారీరక కొలతల్ని సేకరించి.. ఈ రిపోర్టును సిద్ధం చేశారు.

స్థూలకాయం ఉన్న వారిలో పురుషులు 50 కోట్ల వరకు ఉంటే.. మహిళలు 38 కోట్లుగా ఉన్నారు. 2023 నాటికి వయోజనుల్లో ఊబకాయం 88 కోట్లు అయితే.. 1990లో ఈ సంఖ్య 20 కోట్ల లోపే ఉండటం గమనార్హం. అప్పట్లో మహిళల్లో ఊబకాయం 13 కోట్లు ఉంటే.. పురుషుల్లో 7 కోట్లుగా ఉండేది. అది కాస్తా ఇప్పుడు రివర్సు అయ్యింది. భారత్ విషయానికి వస్తే 1990 నాటికి ఇప్పటికి మధ్య ఊబకాయం రేటు బాగా పెరుగుతోంది. 1990లో కేవలం వయోజన మహిళల్లో ఊబకాయం 1.2 శాతం మాత్రమే. అదిప్పుడు 5.4 శాతంగా మారింది. అదే సమయంలో పురుషుల్లోనూ స్థూలకాయులు పెరిగిపోతున్నట్లుగా గుర్తించారు.

Tags:    

Similar News