తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్... ఏపీ ప్లేస్ ఇదే!
తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్‌కం లో తెలంగాణ సత్తా చాటింది
తలసరి ఆదాయం (పర్ క్యాపిటా ఇన్ కం)లో తెలంగాణ సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ వెల్లడించింది. తరువాత నాలుగు స్థానాల్లోనూ దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అవును... రూ.3,08,732 తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ వివరాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... రాష్ట్రం ఏర్పడిత తొలి నాటి (2014-15) కంటే ఇది 150 శాతం ఎక్కువని తెలిపింది.
9 ఏళ్ల క్రితం రూ.1,24,104గా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు మరింతగా పెరిగినట్లు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ పేర్కొంది. ఇక గతేడాదితో పోలిస్తే తలసరి ఆదాయ వృద్ధి రేటు 11 నుంచి 15.1 శాతం మేర పెరిగినట్లు వివరించింది. అలాగే, వచ్చే ఏడేళ్లలో అంటే 2030 నాటికి దేశ ప్రజల తలసరి ఆదాయం 4 వేల డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.
దేశ ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతం సగటున 2,450 డాలర్లుగా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే... తలసరి ఆదాయం విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2,75,443 (3,360 డాలర్లు) కాగా... నాలుగు స్థానాల్లోనూ దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం.
వాటిలో వరుసగా కర్ణాటక (రూ.2,65,623), తమిళనాడు (రూ.2,41,131), కేరళ (రూ.2,30,601), ఆంధ్రప్రదేశ్ (రూ.2,07,771) ఉన్నాయి.
కాగా... గత ఆర్థిక సంవత్సరం 2021-22లోనూ రూ.2,65,942 తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం స్థిరంగా చేడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ఆదాయం మరింతగా పెరిగిందని అంటున్నారు.