కర్ణాటక ఎన్నికల్లోనూ ట్యాపింగ్.. తెరపైకి షాకింగ్ 'నిజాలు'?

ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. అధికార పార్టీకి చెందిన కొందరి దన్నుతో విప పార్టీలకు చెక్ చెప్పేలా

Update: 2024-03-26 06:00 GMT

ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. అధికార పార్టీకి చెందిన కొందరి దన్నుతో విప పార్టీలకు చెక్ చెప్పేలా.. వారి కదలికలు.. వ్యూహాలు నిరంతరం తెలుసుకునేలా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే. అయితే.. ట్యాపింగ్ ఉచ్చు తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని.. తాజాగా వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే పక్క రాష్ట్రాల్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వెలుగు చూస్తున్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళలో అక్కడి కాంగ్రెస్ పార్టీ నేతల మీదా ఫోన్ ట్యాపింగ్ పంజా విసిరినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ విజయ అవకాశాల్ని దెబ్బ తీసేందుకు వీలుగా పావులు కదిపారంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా పలు అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో జనతాదళ్ (సెక్యులర్) కు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వటం తెలిసిందే. కాంగ్రెస్ నేతల గుట్టుమట్లను ఎప్పటికప్పుడు జేడీఎస్ ముఖ్యులకు చేరవేయటంతో పాటు.. కాంగ్రెస్ ఆర్థిక మూలాల్ని దెబ్బ తీసేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ కారణంగానే అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఇళ్లపైనా.. వారి ఆర్థిక మూలాలపైనా తనిఖీలు చేపట్టి.. వారిని బలహీనం చేసే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక నుంచి అందే సాయాన్ని అడ్డుకోవటానికి ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని సంధించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే మరే పార్టీకి సంబంధించిన నగదు పట్టుబడకుండా.. కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి నగదు దొరకటం వెనుక అసలు సీక్రెట్ ఇదేనని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్రానికే పరిమితం కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లారన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

Tags:    

Similar News