ఫోన్‌ ట్యాపింగ్‌ .. ఈ ఐదుగురిదే ప్రధాన పాత్ర!

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-11 08:04 GMT

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, సినిమా తారలు, బిల్డర్లు, వ్యాపారవేత్తలు, తదితరుల ఫోన్లను ట్యాప్‌ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధా కిషన్‌ రావు ఆదేశాలతోనే ప్రణీత్‌ రావు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఇప్పటికే రాధాకిషన్‌ రావుతోపాటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అరెస్టు చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఏ1 నిందితుడిగా మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావును పోలీసులు చేర్చారు. ప్రస్తుతం ఆయన అమెరికా వెళ్లిపోవడంతో పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఒక పార్టీ అధినేత, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, నాటి ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు లభిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అరెస్టు చేసి వారి ద్వారా పోలీసు అధికారులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు.

ఆ పార్టీ అధినేత, ఒక ఎంపీ, ఎమ్మెల్సీ, ఇద్దరు మాజీ మంత్రుల పాత్రకు సంబంధించి పూర్తి వివరాలు లభ్యమయ్యాక వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. వీరంతా అక్రమాలకు పాల్పడ్డారనేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌ రావును విచారించగా ఆ ఐదుగురి పాత్ర బయటపడినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ కేసు విచారణలో దూకుడు పెంచారు. పూర్తి స్థాయి ఆధారాలు లభించాక ఆ ఐదుగురిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్త కోట శ్రీనివాస్‌ రెడ్డి తొలిసారి స్పందించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పారదర్శకంగా విచారణ చేస్తున్నామని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతామన్నారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఎప్పుడు ఇస్తామో త్వరలోనే తెలియజేస్తామన్నారు.

కాగా గత ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కు పాల్పడ్డవారు ఆ కంప్యూటర్‌ డిస్కులను, డేటాను ధ్వంసం చేశారు. ఈ ఆరోపణలతోనే మార్చిలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు అరెస్ట్‌తో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బయటపడింది.

Tags:    

Similar News