ఫోన్ ట్యాపింగ్ లో కొత్త అధ్యాయం.. విదేశాల్లో నిందితుల అరెస్టులు?
సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి వేగంగా కొన్నిసార్లు.. నెమ్మదిగా మరికొన్నిసార్లు విచారణ సాగుతున్న పరిస్థితి. కొన్నిసార్లు వరుస పెట్టి అరెస్టు దూకుడుగా సాగితే.. మరికొంతకాలం స్తబ్దు వాతావరణం నెలకొనటం చూస్తున్నదే. తాజాగా మరోసారి ఈ కేసు విషయంలో కదలిక మొదలైంది.
ట్యాపింగ్ లో కీలక నిందితుల్లో పలువురు విదేశాల్లో ఉండటం తెలిసిందే. దీంతో వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. ఒక చానల్ ఎండీ శ్రవణ్ రావుల అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ స్కాం వెలుగు చూసే నాటికే ప్రభాకర్ రావుతో పాటు మరికొందరు విదేశాలకు వెళ్లిపోయారు.
దీంతో.. వారిని అదుపులోకి తీసుకోవటానికి వీలుగా ఇంటర్ పోల్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారిని అరెస్టుచేయటానికి వీలుగా రంగం సిద్ధమైంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి నేషనల్ సెంట్రల్ బ్యూరో అధికారులతో సీబీఐ అధికారులతో సమన్వయం చేసుకోవటం గమనార్హం. అమెరికా - భారత్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితుల అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ట్యాపింగ్ కేసుకు సంబంధించి అమెరికాలో అరెస్టులు జరగనున్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.