పిన్నెల్లి ఎపిసోడ్ లో అసలేం జరుగుతోంది !?
పిన్నెల్లి పై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
By: Tupaki Desk | 27 May 2024 2:30 PM GMTమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో అసలు ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే అంతటా సాగుతోంది. పిన్నెల్లి మీద ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఇపుడు ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో ఏకంగా వాదనలు వినిపిస్తున్నారు.
వాస్తవానికి చూస్తే పిన్నెల్లి మాచర్ల వైసీపీ అభ్యర్ధి. ఆయనను ఈ నెల 4న జరిగే కౌంటింగ్ కి అనుమతిస్తూ ముందస్తు బెయిల్ హైకోర్టు ఇచ్చింది. అయితే ఆ బెయిల్ రద్దు చేయడానికి అన్నట్లుగా కోర్టులో వాదనలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే పిన్నెల్లి పై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడి అయింది అంటున్నారు.
ఆయన మీద పెట్టిన మూడు కేసులు వాస్తవంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసినట్లుగా ఉంది. కానీ ఈ రోజు హైకోర్టు విచారణలో మే 22న నమోదు చేసినట్లు హైకోర్టుకు పోలీసులు చెప్పడం మీద కూడా చర్చ సాగుతోంది. పిన్నెల్లి పై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
ఇక ఒక ప్రభుత్వ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు. ఆయనకు తెలియకుండా కనీసం ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు మరో న్యాయవాది అశ్వనీకుమార్ హాజరు కావడం కూడా విస్మయం కలిగించేలా ఉందని అంటున్నారు.
దీనికి తోడు అన్నట్లుగా ఇవాళ టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటిషన్ వేసి బాధితుల తరఫున వాదనలు వినిపించడం కూడా చిత్రంగా ఉంది అని అంటున్నారు. ఈ తరహా వ్యవహారాలపై న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది అని అంటున్నారు.
నిజానికి చూస్తే ఈవీఎంల ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటని ఇస్తూ బెయిల్ ముందస్తుగా మంజూరు చేసింది. జూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి తెర వెనక కుట్రలు సాగుతున్నాయని మొత్తం ఎపిసోడ్ పరిశీలిస్తున్న వారిలో చర్చ సాగుతోంది.
ఇపటికే హత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులు వాటి ఆధారంగా బెయిల్ ని రద్దు చేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. కానీ అవి బెయిల్ కంటే ముందే నమోదు అయిన కేసులుగా కోర్టులో పిన్నెల్లి తరఫున న్యాయవాదులు వాదించారు.
ఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని పిన్నెల్లి తరఫున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వెంటనే హైకోర్టు రికార్డులు పరిశీలించింది. దాంతో పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడి అయింది.
ఆ మీదటనే అంటే మే 24నే స్థానిక మెజిస్ట్రేట్ కి తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి అవడం గమనార్హం. వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థం కాలేదని పిన్నెల్లి తరఫున న్యాయవాది వాదించారు. హైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని పిన్నెల్లి తరఫు న్యాయవాది తెలిపిన నేపధ్యంలో రికార్డులను పరిశీలించిన తర్వాత తీవ్ర విస్మయం వ్యక్తం అయింది అని అంటున్నారు.
పిన్నెల్లి విషయంలో ఇంత పట్టుదలగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది కూడా చర్చగా సాగుతోంది. ఇక కోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చ తీవ్రంగా సాగుతోంది. ఎవరి వెన్నుదన్నుతో ఇదంతా జరుగుతోంది అన్న దానిపైన అంతా చర్చిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ కేసు విషయంలో తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. మరో వైపు చూస్తే పిన్నెల్లి విషయంలో మాత్రం ఏదో జరుగుతోంది అన్న భావన అయితే సర్వత్రా వ్యక్తం అవుతోంది అని అంటున్నారు.