పిఠాపురానికి బైపాస్ సర్జరీ చేయాల్సిందే పవన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో తరచూ ఏదో ఒక రచ్చ తెర మీదకు వస్తోంది.;

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో తరచూ ఏదో ఒక రచ్చ తెర మీదకు వస్తోంది. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న పవన్.. ఏపీని మార్చటానికి ముందు తన నియోజకవర్గం సంగతి చూడాలని చెబుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పార్టీలో ఐక్యత లేకపోతే.. మిగిలిన వాటి సంగతేంటి? అన్నది ప్రశ్నగామారింది. ఇప్పటికే టీడీపీ.. జనసైనికుల మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. దీనికి సంబంధించిన బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం పవన్ కు ఉందన్న మాట తరచూ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన అంబేడ్కర్ జయంతి వేళ.. జనసైనికులకు సంబంధించిన రెండు వర్గాల మధ్య రచ్చ హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి చెందిన రెండు వర్గాలు మాటా మాటా అనుకోవటమే కాదు.. అంతకు మించి అన్నట్లుగా బాహాబాహీకి దిగటం పార్టీ వర్గాల నోట మాట రాకుండా చేసిందంటున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి వేడుకల్ని పార్టీ తరఫున పలు కార్యక్రమాల్ని చేపట్టారు.
పిఠాపురం పార్టీ ఇంఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అయితే.. ఆయన వెంట హాజరైన జనసేన నేతల్లో కొందరు రెండు వర్గాలుగా విడిపోవటంతో వివాదంగా మారింది. ఇందిరానగర్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో వీరి మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. ఒకరికొకరు తమకే ఎక్కువ ప్రాధాన్యత దక్కాలంటూ మొదలైన వాదన చివరకు రచ్చగా మారింది. తాము మొదట్నించి పార్టీలో ఉన్నామని ఒక వర్గం వాదిస్తే.. ఎప్పుడు వస్తే మాకేంటి? తాము కూడా పని చేశామని రెండో వర్గం వారు ఫైర్ అయ్యారు. ఇలా ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి బాహాబాహీకి తలపడ్డాయి. దీంతో.. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య నడిచిన పంచాయితీని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించగా.. అవేమీ ఫలించలేదు. మొత్తంగా పిఠాపురంలో పార్టీ వ్యవహారాల అంశంపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.