ఎమ్మెల్సీ నాగబాబుగా పిఠాపురంలోకి... వర్మ సంగతేంటి ?
అనాడు ఎమ్మెల్సీగా ఏకగ్రీవమైన నాగబాబు ఈ రోజు అధికారికంగా ప్రమాణం చేసి మరీ తొలి అడుగులు పిఠాపురం వైపు వేస్తున్నారు.;

పిఠాపురం జనసేన అడ్డా అని బిగ్ సౌండ్ చేసిన ఆ పార్టీ ఇపుడు తనదైన యాక్షన్ ప్లాన్ లోకి దిగిపోతోంది. పవన్ గెలుపు వెనక పవన్ క్రేజ్, పిఠాపురం ఓటర్లు, జనసైనికులు ఉన్నారని జనసేన ఆవిర్భావ సభలో గట్టిగా చెప్పిన నాగబాబు వేరే ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే అది వారి ఖర్మ అని పరోక్షంగా పిఠాపురం వర్మను కెలికారు.
అనాడు ఎమ్మెల్సీగా ఏకగ్రీవమైన నాగబాబు ఈ రోజు అధికారికంగా ప్రమాణం చేసి మరీ తొలి అడుగులు పిఠాపురం వైపు వేస్తున్నారు. ఇపుడు నాగబాబు అఫీషియల్ గా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనవచ్చును. అందుకే ఆయన తన రెండు రోజుల పిఠాపురం టూర్ ని అధికారికంగానే షెడ్యూల్ చేశారు.
నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్న నాగబాబు వెంట మరో జనసేన ఎమ్మెల్యే హరిప్రసాద్ అలాగే ఇతర జనసేన నాయకులు ఉన్నారు. కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను ఆ నియోజకవర్గం ఇంచార్జి వర్మను పిలవలేదు.
దాంతో గ్యాప్ అలా కంటిన్యూ అవుతోంది అని అర్ధం అవుతోంది. కూటమిలో ఉన్నపుడు ఆ నాయకులను పిలవడం ఒక ఆనవాయితీ. కానీ దానికి పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. పిఠాపురం వర్మ ఇటీవల కార్యకర్తే అధినేత అని తన పర్యటనలు మొదలెట్టారు.
ఆయనకు పోటీ కాకపోయినా తమదైన స్టైల్ లో అన్నట్లుగా ఇపుడు జనసేన రెడీ అయింది అని అంటున్నారు. నాగబాబు ఇపుడు పిఠాపురం జనసేన ఇంచార్జి కాబోతున్నారు అని అంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకోవచ్చు.
అది పిఠాపురమే అని అంటున్నారు. దీని ద్వారా జనసేనను మరింత బలోపేతం చేస్తూ అదే సమయంలో పిఠాపురం వర్మను సైడ్ చేయాలన్న ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక వర్మ అయితే చాలా వరకూ జనసేనతో సఖ్యతకు చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన తన పర్యటనలలో కానీ తన ఫ్లెక్సీలలో కానీ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నారు. కానీ జనసేన నేతలు మాత్రం వర్మను దూరం పెడుతున్నారు అని అంటున్నారు.
ఇక ఇపుడు పిఠాపురానికి నాగబాబు రాకతో అసలైన ఆట స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఒక వైపు చూస్తే ఎమ్మెల్యే సీటు పొత్తులో త్యాగం చేయాల్సి వచ్చింది. మరో వైపు చూస్తే ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. ఇపుడు చూస్తే పిఠాపురంలో రాజకీయంగా సైడ్ అయ్యేలా సీన్ వర్మకు కనిపిస్తోందా అన్న చర్చ సాగుతోంది.
మెగా ముప్పు ఆయనకు ఉందా అన్న చర్చ కూడా ఉంది. ఒక విధంగా చూస్తే వర్మ రాజకీయంగా ఇపుడు ఇబ్బందిలో ఉన్నారా లేక నెట్టబడ్డారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా స్థానిక జనసేన నాయకులతో వైరమే వర్మకు ఈ పరిస్థితి తెచ్చిందా అన్న చర్చ కూడా ఉంది. ఇక నాగబాబు ఎమ్మెల్సీగా పిఠాపురాన్ని అట్టిపెట్టుకొని ఉంటారని అంటున్నారు. దాంతో వర్మ సంగతేంటి అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.