పిఠాపురం వర్మ కొత్త డిమాండ్... బాబుని ఇరకాటంలో పెట్టేలా !
తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎపుడు ఏమి చేయాలో తెలుసు.;

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎపుడు ఏమి చేయాలో తెలుసు. ఆయన పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ నిర్ణయాలను ఎంతో ఆలోచించి తీసుకుంటారు. బాబుకు సలహాలు ఇచ్చే పని ఎవరు చేసినా అది తప్పే అవుతుంది. పైగా టీడీపీ వంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో అలాంటివి కుదరవు. ఇదిలా ఉంటే పిఠాపురం వర్మ అటు తిరిగి ఇటు తిరిగి ఒక కొత్త డిమాండ్ ని అందుకున్నారు.
లోకేష్ కి టీడీపీ సారధిగా నియమించాలని ఆయన కోరుతున్నారు. అంటే బాబు టీడీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని తనయుడికి బాధ్యతలు అప్పగించడం అన్న మాట. నిజానికి చూస్తే తెలుగుదేశం పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నా లోకేష్ నే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు అన్నది ప్రచారంలో ఉంది. అంతే కాదు లోకేష్ పలుకుబడి పార్టీలో చాలానే పెరిగింది అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో లోకేష్ కి ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎపుడు ఇవ్వాలన్నది చంద్రబాబుకు తెలియనిది కాదు అని అంటున్నారు. అయితే పిఠాపురం వర్మ సడెన్ గా లోకేష్ ని పార్టీ సారధిగా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన యువగళం పాదయాత్ర చేయడం వల్లనే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పారు.
టీడీపీకి నారా లోకేష్ నాయకత్వం అవసరం అని కూడా వర్మ గట్టిగా చెబుతున్నారు లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరిన్ని విజయాలు సాధిస్తుందని కూడా ఆయన నమ్మకంగా చెబుతున్నారు. టీడీపీకి భవిష్యత్తు నాయకులు ఉండాలని వర్మ కోరారు. 2047 అన్నది ఏపీ ప్రగతికి మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా ఉండాలని ఆయన కోరుతున్నారు
లోకేష్ భావి తరాలకు నాయకుడని ఆయన వల్ల యువత టీడీపీ వైపు పెద్ద ఎత్తున టర్న్ అయింది అని అన్నారు. అంతే కాదు అన్ని వర్గాల ప్రజలూ టీడీపీ వైపు చూసేలా లోకేష్ నాయకత్వం ఉందని చెప్పారు. మొత్తానికి వర్మ డిమాండ్ ఏంటి అంటే అర్జెంటుగా లోకేష్ కి పార్టీ పగ్గాలు ఇవ్వాలని.
ఇక పిఠాపురంలో చూస్తే వర్మ వర్సెస్ జనసేనగా రాజకీయం సాగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. ఇటీవల ఎమ్మెల్సీ జనసేన నేత నాగబాబు పర్యటన కూడా రచ్చగా సాగింది. ఈ సమయంలో ఉన్నట్లుండి వర్మ లోకేష్ నినాదాన్ని అందుకోవడం వెనక ఏమై ఉంటుంది అంతా చర్చిస్తున్నారు.
గతంలో ఇదే వర్మ లోకేష్ ని కాబోయే సీఎం గా పేర్కొంటూ డిమాండ్ చేశారు. దాని మీద కూడా తర్వాత చాలా మంది నాయకులు మాట్లాడడంతో అది రచ్చగా మారింది. చివరికి టీడీపీ అధినాయకత్వం కలుగచేసుకుని ఈ సమయంలో ఈ తరహా డిమాండ్లు వద్దని వారించింది దాంతో దానికి బ్రేక్ పడిపోయింది.
అయితే ఇపుడు మరో రూట్ లో వర్మ వచ్చారని అంటున్నారు. టీడీపీ ప్రెసిడెంట్ లోకేష్ అని ఆయన కోరుతున్నారు. మిగిలిన వారు కూడా ఈ నినాదం అందుకుంటే కనుక బాబుకు ఇరకాటమే అని అంటున్నారు. అయితే ఇలాంటి డిమాండ్లతో వర్మ ఏమి సాధిస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది.
లోకేష్ అయితే తనకు మరింత పార్టీలో ప్రభుత్వంలో వెసులుబాటు దొరుకుతుందని ఆయన భావిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. లోకేష్ టీం లో చేరడం ద్వారానే పిఠాపురంలో తన హవా నిలబెట్టుకోవడంతో పాటు జనసేనను తట్టుకుని నిలబడగలను అని ఆయన భావిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మొత్తానికి వర్మ ప్రశాంతగా ఉన్న టీడీపీలో ఒక రాయి వేసి కెలికారు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.