పిఠాపురంలో పవనోత్సాహం... భారీ పోలింగ్ లెక్కలు ఏమి చెప్పబోతున్నాయి?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ అట్రాక్షన్ గా మారిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఠక్కున పిఠాపురం పేరు చెప్పేవారు! కారణం.. అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీలో ఉండటమే. అయితే తాజాగా పిఠాపురంలో పోలైన ఓట్ల పై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత హాట్ టాపిక్ గా మారిన పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లు పోటెత్తారనే చెప్పాలి. గతంలో ఎన్నడూలేని విధంగా అన్నట్లుగా... ఈ ఎన్నికల వేళ పోలింగ్ ప్రక్రియ భారీగా సాగింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో ఓటర్లు తమదైన ఉత్సాహాన్ని ప్రదర్శించారని అంటున్నారు.
అయితే... ఆ ఉత్సాహం పవన్ కు ఏస్థాయిలో ఉపయోగపడుతుండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈదఫా ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో 86.63 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇది కచ్చితంగా బెస్ట్ ఫిగరనే చెప్పాలి. కారణం... రాష్ట్ర విభజన అనంతరం ఈ స్థాయిలో పోలింగ్ జరిగింది ఇప్పుడే!
2014లో పిఠాపురం నియోజకవర్గంలో 79.44 శాతం పోలింగ్ నమోదవ్వగా.. 2019లో 80.92 శాతమని లెక్కలు చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈసారి నమోదు ఎక్కువే.. దీనికి కారణం పవన్ పోటీ చేయడమే అని చెప్పేవారూ ఎక్కువే!
వాస్తవానికి ఈసారి గాజువాక, భీమవరం కాకుండా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటినుంచీ ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. ఇక జబర్ధస్త్, సీరియల్స్, సినిమా నటీనటులు పవర్ స్టార్ కోసం స్టార్ క్యాంపెయినర్లుగా మారి క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారం చేశారు.
ఈ నేపథ్యంలో... పోలింగ్ రోజుకు ప్రధానంగా వృద్ధులు, మహిళలతో పాటు యువత, ఉద్యోగులు భారీగా క్యూకట్టారు. నాన్ లోకల్ అంశం కాసేపు పక్కనపెడితే... యువత, ఉద్యోగులు ప్రధానంగా పవన్ కోసమే ఈ స్థాయిలో పోటెత్తారని అంటున్నారు. ఈ భారీ పోలింగ్ కి కారణం పవనోత్సాహమే అనేది పరిశీలకుల మాటగా ఉంది. జూన్ 4న క్లారిటీ రానుంది!