హైడ్రాకు భారీగా ఫిర్యాదులు... తెరపైకి పీజేఆర్ పోరాడిన అంశం!

పైగా.. చెరువులను చెరపట్టినవారు ఎంతటివారైనా వదిలేది లేదని రేవంత్ ప్రకటించడంతో ఇక ఇప్పుడు ఈ చర్చే ఎటుచూసినా నడుస్తుంది.

Update: 2024-08-26 11:26 GMT

ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మాదాపూర్ లోని ఎన్ కన్వెషన్ నిర్మాణాల కూల్చివేత అనంతరం ఈ చర్చ పీక్స్ కి చేరింది. పైగా.. చెరువులను చెరపట్టినవారు ఎంతటివారైనా వదిలేది లేదని రేవంత్ ప్రకటించడంతో ఇక ఇప్పుడు ఈ చర్చే ఎటుచూసినా నడుస్తుంది.

అవును... ఇప్పుడు తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాద్ లో హైడ్రా గురించిన చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనకు ఎన్ని ఒత్తిడిలు ఉన్నా ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని.. అధర్మంపై ధర్మం గెలవాలంటే యుద్ధం తప్పనిసరి అని.. రేవంత్ కరాకండీగా చెబుతున్న పరిస్థితి. ఈ సమయంలో ప్రజల నుంచే కాకుండా ప్రజాప్రతినిధుల నుంచి కూడా హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఇందులో భాగంగా... తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్మించిన వ్యాపార సంస్థల నిర్మాణాలను తొలగించేలా హైడ్రాను ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా... హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ సరస్సు బఫర్ జోన్ లో అనుమతిచ్చిన కట్టడాలను తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇదే క్రమంలో... ఖైరతాబాద్ దివంగత ఎమ్మెల్యే పి జనార్ధన్ రెడ్డి కూడా గతంలో ఇదే అంశంపై పోరాటం చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు హెచ్.ఎం.డీ.ఏ అధికార పరిధిని రాష్ట్ర స్థాయికి విస్తరించాలని కోరారు. చెరువులు సహా అన్ని నీటి వనరుల చుట్టూ ఉన్న బఫర్ జోనలలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశించాలని కోఈరారు.

మరోపక్క... సిటీలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు సరైనవేనని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అయితే... ఆక్రమిత భూములపై స్థలాలు కొనుగోలు చేసినవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్.టీ.ఎ. లేదా బఫర్ జోన్ లలోని చాలా ప్రాపర్టీలను సామాన్య ప్రజలు కొనుగోలు చేయడంతో.. బిల్డర్ల నుంచి బాధితులకు హైడ్రా డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.

కాగా... ఔటర్ రింగ్ రోడ్ (ఓ.ఆర్.అర్.) పరిధిలో ఆక్రమణకు గురైన 43.94 ఎకరాల భూమిని రక్షించినట్లు ఇటీవల హైడ్రా వెల్లడించిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News