అంతా దైవేచ్ఛ: పూర్తి ఆధ్యాత్మిక రూపం ధరించిన మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీరామ నవమిని పురస్కరించుకుని.. పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగిపోయారు.;

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీరామ నవమిని పురస్కరించుకుని.. పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగిపోయారు. వాస్తవానికి ఆయన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీలంక పర్యటనలో ఉన్నారు. అయితే.. అక్కడ కూడా.. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. `జయశ్రీ బోధి` ఆశ్రమానికి వెళ్లి.. బౌద్ధ సన్యాసులను కలుసుకున్నారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడే చాలా సేపు ధ్యానం చేశారు. జయశ్రీ బోధి అనేది ప్రపంచంలోనే బౌద్ధారామాల్లో కీలకమైన స్థానం పొందింది. శ్రీలంకలోని బౌద్ధులకు ఇదొక మాన్యుమెంటుగా భావిస్తున్నారు.
అనంతరం.. అక్కడ నుంచితిరిగి భారత్‌కు తిరిగి వస్తూ.. తమిళనాడులో ఆగిన ప్రధాని ఇక్కడ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. రామనాథపురం జిల్లాలో ఉన్న రామేశ్వరం ఆలయానికి వెళ్లారు. అక్కడి శివపార్వతులు(రామేశ్వరుడు-పర్వత వర్థిని)లకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే శ్రీరామ నవమి ఉత్సవాల్లోనూ పాల్గొన్నారు. దీనికి ముందు.. ఆయన.. విమానంలో రామేశ్వరం వస్తున్నప్పుడు.. సముద్రంపైనుంచే.. ఎప్పుడో తేత్రాయుగంలో నిర్మించారని భావిస్తున్న `రామసేతు ను` విమానంలో నుంచే ఏరియల్ వ్యూ ద్వారా దర్శించుకున్నారు.
ఈ పరిణామాలను ఉటంకిస్తూ.. ప్రధాన మంత్రి..`అంతా దైవేచ్ఛ` అని ట్వీట్‌చేయడం గమనార్హం. ఒకేరోజు రెండు దర్శనాలు చేసుకున్నానని.. ఇదంతా దేవుడి కృపగా పేర్కొన్నారు. రామసేతును సందర్శించడం(ఏరియల్ వ్యూద్వారా), రామేశ్వరుడిని పూజించడం తన పూర్వజన్మసుకృతమన్నారు. ఇక, ఇదేసమయంలో తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన పంబన్ కొత్త బ్రిడ్జినిప్రధాన మంత్రి ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. దీనిని జాతికి అంకితం చేశారు. సుమారు 560 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్రష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించడం గమనార్హం. అనంతరం.. మండపం(వివేకానంద మెమోరియల్)కు చేరుకున్న ప్రధాని కొద్దిసేపు ధ్యానం చేసి.. తిరిగి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు.