పాడిందే పాట.. ప్రధాని మోడీ పసలేని పిలుపు!
ఇక, ఇదేసమయంలో గత శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్ వేటు వేసిన 146 మంది సభ్యులపై కూడా తాజాగా సస్పెన్షన్ ఎత్తేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్.. పైగా ఎన్నికలకు ముం దు ప్రవేశ పెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సంబంధించిన పార్లమెంటు సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. యథాలాపంగా.. దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులకు ఆహ్వానాలు అందాయి. ఇక, ఇదేసమయంలో గత శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్ వేటు వేసిన 146 మంది సభ్యులపై కూడా తాజాగా సస్పెన్షన్ ఎత్తేశారు. దీంతో కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు సభకు వచ్చేందుకు వీలు ఏర్పడింది.
ఇక, సభ ప్రారంభానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరూ సభకు రావాలని.. చర్చలకు సహకరించాలని ఆయన కోరారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు తాము రెడీనేనని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటుకు ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉన్నాయన్న ఆయన అదేవిధంగా సభ్యులకు బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు సహకరించాలని.. సభలను సజావుగా నిర్వహించేందుకు తోడ్పడాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇక, ప్రధాని ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనా ఇదే పిలుపునిస్తున్నారు. ఎక్కడా ఒక్క అక్షరం కూడా తేడా ఉండడం లేదు. కానీ, సబలో మాత్రం ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడినచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి.
``ప్రతిపక్షాల గురించి బయట బాగానే మాట్లాడతారు. కానీ, లోపల మాత్రం రెచ్చగొడుతున్నారు. కీలకమైన బిల్లులపై ఎలాంటి చర్చలేకుండానే సభలు ముగిసిపోతున్నాయి. ఇక, సభకు వెళ్లి ఏం చేస్తాం`` అని కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈయన తిరువనంతపురం ఎంపీగా ఉన్నారు. మొత్తానికి పాడిందే పాట.. అన్నట్టుగా సభా విలువలు, సంప్రదాయాల గురించి చెబుతన్నప్పటికీ.. సభలో మాత్రం వీటికి ఏమాత్రం ప్రాధాన్యం లేదని.. దాదాపు ప్రతిపక్షాలు అన్నీ అంటున్నాయి.