పోలవరం... కండిషన్ల శాపం!

చిత్రమేంటి అంటే దాదాపుగా ఎనిమిది దశాబ్దాలు నిండుతున్నా స్వతంత్ర భారతంలో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోలేకపోవడం.

Update: 2024-10-11 09:20 GMT

ఏపీకి జీవనాడి అనదగ్గ ఏకైక ప్రాజెక్టు పోలవరం. నిజానికి ఇది బ్రిటిష్ వారి హయాంలో 1940 టైం లో ప్రతిపాదించబడింది. అప్పట్లో రెండవ యుద్ధం గొడవలలో బ్రిటిష్ పాలకులు ఉండడంతో దీనిని టేకప్ చేయలేదు కానీ లేకపోతే ఏనాడో పూర్తి కావాల్సింది. చిత్రమేంటి అంటే దాదాపుగా ఎనిమిది దశాబ్దాలు నిండుతున్నా స్వతంత్ర భారతంలో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోలేకపోవడం.

ఈ ప్రాజెక్ట్ కి కదలిక తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అయితే విభజన తరువాత జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి ఒక వరం ఇచ్చింది నాటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం. అయితే 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఎందుకో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం నానాటికీ పెరిగిపోతోంది. అయినా కేంద్రం ఇచ్చేది మాత్రం పిసరంత ఉంటోంది. గత పదేళ్లుగా కేంద్రం పోలవరానికి ఇచ్చింది అచ్చంగా 15 వేల కోట్లు అనే చెప్పాల్సి ఉంది. ఈ రోజుకు పోలవరం ప్రాజెక్ట్ సరికొత్త అంచనాలు వేసుకుంటే కనుక 70 వేల కోట్లు పై దాటి ఉన్నా ఆశ్చర్యం లేదు.

యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తేనే ఫలితం ఉంటుంది. వ్యయం కొండంత పెరగకుండా ఉంటుంది. అయితే కేంద్రం చేతులలో నుంచి ఈ ప్రాజెక్ట్ ని ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవడం మొదట మంచిదే అనుకున్నా ఇపుడు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిధుల కోసం ప్రతీ సారీ కేంద్రం వైపే చూడాల్సి వస్తోంది.

ఏపీ ప్రభుత్వం తన స్వీయ పర్యవేక్షణలో తొందరగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తుంది కానీ దానికి తగిన నిధులను ఎప్పటికప్పుడు ఇస్తేనే కదా పూర్తి అయ్యేది అన్న మాట ఉంది. పోలవరం విషయంలో ముందుగా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే రీఅంబర్స్ మెంట్ కింద కేంద్రం ఆ సొమ్ములు తిరిగి ఇస్తుంది.

అయితే ఈ ప్రాసెస్ కూడా సుదీర్ఘంగా సాగడం వల్ల పెట్టిన ఖర్చుకు వచ్చిన దానికి మధ్య బోలెడు గ్యాప్ తో మరింత వ్యయమే అవుతోంది. జాతీయ ప్రాజెక్ట్ మీద కేంద్రం బాధ్యత మరింత ఎక్కువగా తీసుకోవడమే కాదు ఎప్పటికపుడు నిధులను తానే విడుదల చేస్తూ అడ్వాన్స్ గా కూడా ఇస్తే ఏపీ ప్రభుత్వం సత్వరం పూర్తి చేస్తుంది కదా అన్నది కూడా ఉంది.

ఇదిలా ఉంటే పోలవరం విషయంలో కేంద్రం పదేళ్ళ చరిత్రలో తొలిసారిగా తాజాగా అడ్వాన్స్ నిధులను విడుదల చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 2,348 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. అయితే ఇందులో 75 శాతం ఖర్చు చేస్తేనే తరువాత నిధులు విడుదల చేస్తామని కేంద్రం కండిషన్ పెట్టింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం దృవీకరణ తప్పనిసరి అని అంటున్నారు.

అంతే కాదు ఇచ్చిన సొమ్ముని సంబంధిత పనులకే ఖర్చు చేయాలని మరో కండిషన్ పెట్టింది. ఒకవేళ పనులు ఆలస్యమైతే స్పష్టమైన కారణాలను గుర్తించాలని పేర్కొంది. పోలవరం పనులను పూర్తి చేసేందుకు కో ఆర్డినేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇపుడు ఇస్తున్న నిధులను ఒప్పందంలో పేర్కొన్న మేరకే ఖర్చు చేయాలి. ఈ నిధులకు సంబంధించిన ఖాతాలను కాగ్ అధికారులకు అందుబాటులోకి ఉంచాలని కూడా స్పష్టం చేసింది.

ఇక ఈ ప్రాజెక్టు విషయంలో ఏదైనా వృధా ఖర్చు పెడితే దానికి కేంద్ర ఖాతాలో వేయరాదు అని మరో కండిషన్ ఉంది. ఒక ప్రత్యేక ఖాతాను తెరచి దాని నుంచే పోలవరం నిధులను డ్రా చేసుకోవాల్సి ఉంది. చేసిన ప్రతీ పనికీ రశీదుకు ఇవ్వాలి, దానికి పోలవరం అధారిటీకి సమర్పించాలని కచ్చితమైన ఇంకో కండిషన్ పెట్టారు

దీంతో ఇన్ని కండిషన్లు పెడుతూ ఇచినది చూస్తే గోరంత ఉందని ఇలా అయితే ఎప్పటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని అంటున్నారు. కేంద్రంలో ఎండీయే ప్రభుత్వం ఉంది, ఏపీలోనూ అదే ప్రభుత్వం ఉంది. మరి ఉదారంగా నిధులను విడుదల చేస్తూ ఒక కాల పరిమితిలో పోలవరం పూర్తి అయ్యేలా కేంద్రం వేగవంతమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా అని అంటున్నారు. ఇలా పిసరంత ఇస్తూ బోలెడంత కండిషన్లు పెడితే ఏపీకి పోలవరం వరంగా ఎపుడు మారుతుంది అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News