మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు.. ఎందుకంటే?

బ్రిటన్ నుంచి 1968లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ దేశం పెద్ద ఎత్తున డెవలప్ కావటం తెలిసిందే.

Update: 2025-02-17 04:46 GMT

మరో సంచలనం చోటు చేసుకుంది. భారత్ కు సన్నిహిత దేశంగా పేరున్న మారిషస్ లో రాజకీయ కుటుంబాల్లో అత్యంత ప్రభావితం చేయగలిగిన రాజకీయ కుటుంబాల్లో ఒకటైన ప్రవింద్ ఫ్యామిలీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుమారు ఏడేళ్ల పాటు మారిషస్ ప్రధానిగా వ్యవహరించిన ప్రవింద జగన్నాథ్ ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక నేరాల్లో ఆయన పాత్రపై లభించిన ఆధారాలతో ఆయన అరెస్టు కాక తప్పలేదు.

బ్రిటన్ నుంచి 1968లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ దేశం పెద్ద ఎత్తున డెవలప్ కావటం తెలిసిందే. ప్రవింద్ హయాంలో బ్రిటన్ ఛాగోస్ ఐల్యాండ్ ను ఈ దేశానికి అప్పగించటం తెలిసిందే. ఛాగోస్ కు సంబంధించి మరింత పరిహారాన్ని కోరుతూ ఆ దేశం బ్రిటన్ తో చర్చలు షురూ చేసింది. అయితే.. ఈ అంశంపై తుది నిర్ణయం అమెరికాదేనని తేల్చి చెప్పింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ముఖ్యమైన మిలిటరీ స్థావరంగా ఉన్న ఈ ద్వీప సముదాయాన్ని అమెరికాకు బ్రిటన్ అద్దెకు ఇవ్వటం తెలిసిందే.

ఇక.. పలు ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలతో పలువురు అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి ఎదురై.. ప్రధాని పదవి నుంచి వైదొలిగి.. మాజీగా మారిన వేళలో ఆయనకు అరెస్టు తప్పలేదు. అరెస్టు వేళ మాజీ ప్రధానమంత్రితో పాటు.. ఆయన సతీమణి కోబితాను గంటల తరబడి విచారణ జరిపారు. విచారణను ఎదుర్కొంటున్న వారిలో ఆయన కోడలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఆయన్ను సెంట్రల్ మారిషస్ లోని మెకాలో ఉన్న నిర్బంధ కేంద్రంలో ఆయన్ను ఉంచారు. మారిషస్ మాజీ ప్రధానిపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఆధారాలతో శనివారం సాయంత్రం ఆయన ఇంట్లో ఆర్థిక నేరాల కమిషన్ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లతో పాటు ఖరీదైన వాచ్ లు.. పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

2017 నుంచి గత ఏడాది (2024) వరకు మారిషస్ కు ప్రధానమంత్రిగా వ్యవహరించిన ప్రవింద్ జగన్నాథ్.. గత ఏడాది చివర్లో నిర్వహించిన ఎన్నికల్లో ఓటమిపాలు కావటంతో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నవీన్ రామ్ గూలం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతామని.. ఆడిట్ నిర్వహిస్తామని ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేళలో ప్రకటించిన కొత్త ప్రధాని తాను చెప్పినట్లే.. లెక్కలు తేల్చటంతో అరెస్టు కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

మాజీ ప్రధానితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సతీమణి కోబితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికి.. ఆ తర్వాత ఆమెను విడిచి పెట్టారు. మాజీ ప్రధానిపై వచ్చిన ఆరోపణల్ని ఆయన లాయర్ ఖండించారు. త్వరలోనే ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తారని చెబుతున్నారు. ప్రవింద్ కు సన్నిహితుడిగా ఉన్న ఒకరి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో.. మాజీ ప్రధాని పేరుతో పాటు ఆయన సతీమణి పేరుతో ఉన్న పలు ఫైళ్లను సీజ్ చేసినట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలో పలు దేశాల కరెన్సీ కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News