హైవే పై నోట్ల కట్టలు...ఇన్ ఫ్లుయెన్సర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు!
ఈ సమయంలో 'మనీ హంట్ ఛాలెంజ్' అంటూ రోడ్డు పక్కన డబ్బులు పడేసిన యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా స్టార్ అవ్వాలనే ఆత్రంలో చాలా మంది చేసే చేష్టలూ నెట్టింట తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని అత్యంత భయంకరంగా ఉంటే.. మరికొన్ని అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయి. ఈ సమయంలో 'మనీ హంట్ ఛాలెంజ్' అంటూ రోడ్డు పక్కన డబ్బులు పడేసిన యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అవును... హైదరాబాద్ లోని బాలనగర్ కూ చెందిన భానుచందర్ అలియాస్ యాంకర్ చందు అనే యూట్యూబర్ ఔటర్ రింగ్ రోడ్ (ఓ.ఆర్.ఆర్.) ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్లలోకి ఇరవై వేల నోట్ల కట్టను విసిరేశాడు. అనంతరం.. "మనీ హంటింగ్ ఛాలెంజ్" అంటూ.. ఆ నోట్ల కట్టను వెతికి డబ్బులు దక్కించుకోండి అని పోస్ట్ పెట్టాడు.
దీంతో.. ఆ నోట్ల కట్ట కోసం జనాలు ఔటర్ రింగ్ రోడ్ పైకి భారీ గా చేరారు. ఈ సమయంలో తమ తమ వాహనాలను రోడ్డుపై ఆపి.. సదరు యూట్యూబర్ విసిరిన డబ్బును వెతకడం మొదలుపెట్టాడు. ఇది ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు భద్రతా సమస్యను పెంచింది. దీంతో.. అవుటర్ రింగ్ రోడ్ పెట్రోలింగ్ సిబ్బంది జోక్యం చేసుకున్నారు.
ఈ సమయంలో... భానుచందర్ వ్యవహారం ప్రజల ప్రాణాలకు, రోడ్డు భద్రతకు కాని కలిగించేలా ఉందంటూ పలువురు నెటిజన్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఈ మేరకు భానుచందర్ పై పోలీసులు బీ.ఎన్.ఎస్. సెక్షన్స్ 125, 292 తో పాటు నేషనల్ హైవే చట్టంలోని సెక్షన్ 8 (1బి) కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు.. ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు! ఈ నేపథ్యంలో తాజాగా భానుచందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన సీపీ... సోషల్ మీడియా స్ఫూర్తికి, అవగాహనకు వేదికగా ఉండాలని.. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదని.. ప్రజల భద్రతకు వ్యక్తులను జవాబుదారీగా ఉంచడానికి రాచకొండ పోలీసులు కట్టుబడి ఉంటారని.. సోషల్ మీడియాలో కంటెంట్ ను బాధ్యతాయుతంగా సృష్టించాలని కోరారు!