తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు.. ఎక్కడ? ఎందుకు?
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సహా.. స్థానికులు వెయ్యి మంది కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సహా.. స్థానికులు వెయ్యి మంది కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్టీ నియోజకవర్గం అయిన భద్రాచలంపై గతంలో సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించారని... అయితే.. ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొత్తం 3 సార్లు మాత్రమే కేసీఆర్ భద్రాచలం పర్యటనకు వచ్చారని తెలిపారు.
2014, 2016, 2022 తర్వాత.. మళ్లీ కేసీఆర్ ఇప్పటి వరకు భద్రాచలం మొహం కూడా చూడలేదని ఎమ్మెల్యే వీరయ్య పేర్కొన్నారు. గత పర్యటనలో కేసీఆర్ భద్రాచలం ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు హామీ నెరవేర్చలేదన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన తాను గెలిచినందునే నిధులు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు.
మరల వరదల సమయంలో 2022వ సంవత్సరంలో వచ్చినప్పుడు 1000 కోట్లు కేటాయించి వరద బాధితులకు పక్కా ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా వరదలు పోటెత్తకుండా కరకట్ట ఎత్తు పెంచి నిర్మిస్తామని చెప్పిన హామీని కూడా కేసీఆర్ మరిచిపోయారని పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మధు ప్రసాద్‌కు ఎమ్మెల్యే వీరయ్య ఫిర్యాదును అందజేశారు.
గతంలో రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి, ఇంతవరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. పైగా తాను అపరభక్తుడినని సీఎం కేసీఆర్ పేర్కొంటారని వీరయ్య మీడియా ముందు వ్యాఖ్యానించారు. అయితే.. ఇలాంటి వాటిపై కేసు నమోదు చేయలేమని పోలీసులు చెబుతున్నారు.