పారిశ్రామికవేత్త హత్య కేసులో షాకింగ్ నిజాలు!

సమాజంలో బంధాలు, అనుబంధాలు, మమతలు, మానవత్వాలు మట్టికొట్టుకుపోతున్నాయి. చిన్న పిల్లాడి నుంచి కాటికి కాలుచాచిన పెద్దమనిషి దాక అందరూ డబ్బుకు దాసోహం అంటున్నారు.

Update: 2025-02-18 08:06 GMT

సమాజంలో బంధాలు, అనుబంధాలు, మమతలు, మానవత్వాలు మట్టికొట్టుకుపోతున్నాయి. చిన్న పిల్లాడి నుంచి కాటికి కాలుచాచిన పెద్దమనిషి దాక అందరూ డబ్బుకు దాసోహం అంటున్నారు. భార్యాభర్తల మధ్య డబ్బుల గొడవలే..తల్లిదండ్రులు పిల్లల మధ్య డబ్బుల గొడవలే..చుట్టాల నుంచి స్నేహితుల దాక అన్నీ పైసా బంధాలే..భూమి పంచాయితీలు మొదలు బిజినెస్ పంపకాల వరకు నిత్యం ఏదో ఒక చోట కలహాలు కలవరపెడుతున్నాయి. డబ్బు కోసం కొట్టుకున్నారంటే అర్థముంటుంది కానీ ఏకంగా ప్రాణాలు తీసేస్తున్నారు నేటి మనుషులు. డబ్బు సంపాదన ధ్యేయంగా పరుగులు పెడుతూ ఈజీ మనీ కోసం జనాలు వెంపర్లాడుతున్నారు. మనీ మత్తులో మనోళ్లు అని కూడా చూడకుండా మటాష్ చేసేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఓ బడా పారిశ్రామికవేత్త హత్య అందరినీ కలిచివేసింది. తాత తనకు ఆస్తి పంచివ్వలేదని సొంత మనవడే దారుణంగా చంపిన విషయం తెలిసి సగటు జీవి మనస్సు కకావికలమైంది.

హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త చంద్రశేఖర్ జనార్దన్ రావు హత్య విషయం అందరికీ తెలిసిందే. ఆయన హత్య చేసింది సొంత మనవడు. కుమార్తె కొడుకు అయిన కిలారు కీర్తితేజ. జనార్దన్ రావు హత్య జరిగిన తర్వాత వెంటనే పోలీసులు నిందితుడిని గుర్తించారు. కీర్తితేజను అరెస్ట్ చేసి అతడి నుంచి హత్య వివరాలను రాబట్టారు. కీర్తితేజ పోలీస్ కస్టడీ సోమవారమే ముగిసింది. పోలీస్ విచారణలో షాకింగ్ గురి చేసే ఎన్నో అంశాలు బయటపడ్డాయి. కీర్తితేజ తన తాతను హత్య చేయడానికి దారితీసిన కారణాలు, హత్య చేసిన విధానం చూసి పోలీసులే నివ్వెరపోయారు. తాజాగా కీర్తితేజ నుంచి రాబట్టిన విషయాలను పోలీసులు వెల్లడించారు. తాత జనార్దన్ రావు తనను నిత్యం అవమానించేవాడని, అది భరించలేకే హత్య చేసినట్టు కీర్తితేజ విచారణలో చెప్పినట్టు సీఐ శోభన్ తెలిపారు..

తాత జనార్దన్ రావు..తనను ఏనాడు మనవడిగా చూడలేదని, కనీసం కుటుంబ సభ్యుడినన్నా వాత్సాల్యం చూపించలేదని.. అందరి కంటే హీనంగా చూస్తూ తనపట్ల దయనీయంగా వ్యవహరించేవాడని కీర్తితేజ పోలీసుల ఎదుట వాపోయాడు. ప్రతీ రోజూ తనను బెగ్గర్ అంటూ సంబోధించడమే కాకుండా తమ ఆఫీస్ కు వెళ్తే అక్కడ కూడా హీనంగా చూసేవాడట. దీంతో తమ సిబ్బంది కూడా తనను చిన్నచూపు చూసేవారని చెప్పుకొచ్చాడు. ఆస్తి పంపకాలు పదవులు కేటాయింపుల్లోనూ తనను తక్కువగా చూశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా జనార్దన్ రావు రెండో కుమార్తె కొడుకుకు ఇచ్చాడని, అప్పటి నుంచి తనకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయని, దీంతో చేసేదేంలేక తాతను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు కీర్తితేజ వెల్లడించాడు. తాతను హత్య చేస్తేనే తనకు ఆస్తి దక్కుతుందని ఇన్ స్టా మార్ట్ నుంచి ఓ కత్తిని కొనుగోలు చేశాడని చెప్పాడు.

హత్య జరిగిన రోజు తనకు తాత జనార్దన్ రావుకు పెద్ద గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే..ఇవ్వను పో అంటూ దూషించాడట. ఇక కోపంతో రగిలిపోయిన కీర్తితేజ తాను కొన్న కత్తితో తాతను కసితీరా పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. హత్య చేసిన తర్వాత బీఎస్ మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో కత్తి, రక్తంతో తడిచిన బట్టలను తగులబెట్టానని కీర్తితేజ వెల్లడించాడు. అయితే మంటల్లో కత్తి కాలిపోకపోవడంతో దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హత్య జరిగిన వెంటనే కీర్తితేజను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. అయితే మొదటి రోజు విచారణలో అతడు నోరు విప్పలేదు. సీన్ రీకన్ స్ట్రక్షన్ కు కూడా సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినా నేలచూపులు చూసేవాడు. ఇక రెండో రోజు సైతం సీన్ రీకన్ స్ట్రక్షన్ కు తీసుకెళ్లిన పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి కీర్తితేజ హత్యపై నోరువిప్పాడు. నిందితుడిని విచారణ అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

కీర్తితేజ లాంటి యువత నేడు సమాజంలో ఎక్కువగా పెరిగిపోతుండడం కలవరపరిచే అంశమే. ఆస్తి పంపకాలు ఇప్పుడు చాలెంజింగ్ గా మారాయి. కుటుంబ సభ్యులు అందరు కూర్చుని మాట్లాడుకుంటే సద్దుమణిగే సమస్యలు ఎన్నో ఉంటాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు మనుషుల ప్రాణాలను తీసుకుంటుండడం బాధాకరం.

Tags:    

Similar News