విచారణ వేళ నీళ్లు నమిలిన నందిగం.. అడ్డంగా బుక్?

దాడి ఘటనకు తనకు సంబంధం లేదన్నట్లుగా ఆయన చెప్పగా.. ఘటనా స్థలంలో ఆయన ఉన్నారన్న విషయాన్ని తెలిపే సాంకేతిక ఆధారాల్ని పోలీసులు చూపించటంతో నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది.

Update: 2024-09-17 04:58 GMT

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యాలయం మీద దాడి జరిగిన ఉదంతంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు అయ్యారు. ఇటీవల ఆయన్ను వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో పరామర్శించిన వైనం తెలిసిందే. ఇదిలా ఉండగా.. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయన్ను కోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మౌనంగా.. మరికొన్ని ప్రశ్నలకు పొంతన లేకుండా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

దాడి ఘటనకు తనకు సంబంధం లేదన్నట్లుగా ఆయన చెప్పగా.. ఘటనా స్థలంలో ఆయన ఉన్నారన్న విషయాన్ని తెలిపే సాంకేతిక ఆధారాల్ని పోలీసులు చూపించటంతో నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది. తాను అటు వైపు వెళుతున్నప్పుడు ఏదో అలజడి జరుగుతోందని తెలుసుకొని.. పరిశీలించానని మాత్రమే చెప్పారు. తాను ఘటనా స్థలంలో లేనని చెప్పినట్లు తెలుస్తోంది. తాను.. లేళ్ల అప్పిరెడ్డి కలిసి లేమని.. వేర్వేరుగా టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నట్లుగా చెప్పగా.. దానికి కౌంటర్ గా.. వైసీపీ కార్యాలయం నుంచి ఈ ఇద్దరు నేతలు కలిసి బయలుదేరినట్లుగా ఉన్న ఫోటోల్ని చూపించగా నందిగం మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు.

అప్పటికి తాను వేరే మార్గం నుంచి వచ్చినట్లు చెబుతూ.. అప్పిరెడ్డిని వైసీపీ కార్యాలయంలో మాత్రమే కలిసినట్లుగా చెప్పగా.. వారి గన్ మెన్ల నుంచి సేకరించిన వివరాల్ని నందిగం ముందు పెట్టగా నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది. విచారణ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఉదంతంలో నాటి ఎంపీ నందిగం సురేశ్ కొంతమేర ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. పోలీసుల ప్రశ్నలు.. ఆయన సమాధానాలు నందిగంకు రానున్న రోజుల్లో చిక్కులు తెచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ముగియనుంది. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

Tags:    

Similar News