జత్వానీ వేధింపుల కేసు.. ఆ అధికారులపై చర్యలు షురూ

సినీ నటి కాదంబరీ జత్వానీ ఎపిసోడ్ లో మరో పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-09-14 07:12 GMT

సినీ నటి కాదంబరీ జత్వానీ ఎపిసోడ్ లో మరో పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుడి ఫిర్యాదుతో ముంబయి నుంచి ఆగమేఘాల మీద ఆమెను.. ఆమె తల్లిదండ్రులను విజయవాడకు తీసుకురావటం.. వేధింపులకు గురి చేయటం.. రిమాండ్ కు పంపటం.. ముంబయిలోని పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసును వాపసు తీసుకుంటానన్న హామీతో ఆమెకు బెయిల్ వచ్చినట్లుగా చెబుతున్న ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ఏపీలోని కూటమి సర్కారు సీరియస్ గా తీసుకోవటం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి.. ఆమెను వేధింపులకు గురి చేసిన పోలీసులు.. పోలీసు ఉన్నతాధికారులపై చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కేసు సమయంలో విజయవాడలో ఏసీపీగా పని చేసిన హనుమంతరావు.. నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం. సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు.

జత్వానీ ఎపిసోడ్ తర్వాత.. సీఐగా ఉన్న హనుమంతరావు తర్వాత కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ ఆమె పోలీసు కస్టడీలో ఉన్న వేళ.. కాకినాడ నుంచి ప్రత్యేకంగా విజయవాడకు వచ్చి మరీ ఆమెను ఇంటరాగేషన్ చేపట్టారు. ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిన వైనంపై చర్యలు చేపట్టారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు గురించిన వివరాల్ని పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పిన కారణంగా కేసు నమోదు చేయటం.. వాయువేగంగా అరెస్టు చేసిన వైనంపై విమర్శల్ని ఎదుర్కొన్నారు.

ఈ కేసు మొత్తాన్ని నడిపించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. నాటి నిఘా విభాగం అధినేతగా ఉన్న సీతారామాంజనేయులు.. కీలకస్థానాల్లో ఉన్న కాంతిరాణా తాతా (విజయవాడ సీపీ).. విశాల్ గున్నీ (డీసీపీ)లపై చర్యలకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తనపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన ఇష్యూకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ లతో పాటు.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పైనా నటి జత్వానీ కంప్లైంట్ చేశారు.

వీరంతా కలిసి కట్టుగా తనపై తప్పుడు కేసులు పెట్టారని.. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వైనంపై ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి నటి జత్వానీ ఆమె తల్లిదండ్రులు.. న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ముంబయి వచ్చి తనను.. తన తల్లిదండ్రుల్ని అరెస్టు చేసిన వైనం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు.

తనను కస్టడీలోకి తీసుకొని ఐదురోజల పాటు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అర్థరాత్రి కూడా ఇంటరాగేషన్ చేసినట్లుగా పేర్కొన్నారు. తాము ఏ తప్పు చేయకున్నా.. తమ కుటుంబం 42 రోజుల పాటు జైల్లో మగ్గినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారిపై చర్యల కోసం కేసులు నమోదు చేయాలని కోరారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సీఐ చంద్రశేఖర్.. న్యాయసలహా తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి.. సంచలన పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News