హిట్ లిస్టు రెడీ.. బియ్యం మాఫియాపై గురి?

ఈ క్రమంలో అసెంబ్లీలో రేషన్ బియ్యం మాఫియాపై చర్చ సందర్భంగా నెక్ట్స్ అరెస్టు అయ్యే నేతలపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు.;

Update: 2025-03-06 12:51 GMT

కూటమి ప్రభుత్వంలో నెక్ట్స్ అరెస్టు అయ్యేది ఎవరన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురు నేతలు వరుస కేసుల్లో ఇరుక్కుంటుండటం, అప్పటి స్కాంలు బయటకి వస్తుండటంతో ఎవరు? ఎప్పుడు అరెస్టు అవుతారనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో రేషన్ బియ్యం మాఫియాపై చర్చ సందర్భంగా నెక్ట్స్ అరెస్టు అయ్యే నేతలపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన నేతలపై త్వరలో చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటనతో త్వరలో బియ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలు అరెస్టు అవుతారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర అసెంబ్లీలో ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మాట్లాడిన మంత్రి మనోహర్ బియ్యం అక్రమ రవాణాపై సమాచారం తెప్పించుకుంటున్నామని, త్వరలో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేశారని మంత్రి మనోహర్ ఆరోపించారు. రేషన్ బియ్యం స్మగ్లింగును అడ్డుకునేందుకు సివిల్ సప్లైస్ చట్టాలు, పీడి యాక్ట్ సవరణ చేస్తున్నామని తెలిపారు. కాకినాడ పోర్టులో 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని, అందులో 25 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ గా గుర్తించినట్లు వెల్లడించారు. అదేవిధంగా మచిలీపట్నం, కాకినాడ, బేతంచర్లలో బియ్యం అక్రమ నిల్వలు, స్మగ్లింగుపై ఫిర్యాదులు వచ్చాయని మంత్రి సభకు తెలిపారు.

ఈ గిడ్డంగుల నుంచి పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నామని, నివేదికలు వచ్చాక చర్చలు తీసుకుంటామన్నారు. మచిలీపట్నం గొడౌను నుంచి తరలించిన బియ్యానికి వేర్ హౌసింగు మేనేజ్మెంటుపై కోటి 70 లక్షల రూపాయలు రికవరీ జరిగిందని వివరించారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు. దీంతో రేషన్ మాఫియాపై చర్యలకు సమయం ఆసన్నమైందనే టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారంలోనే అరెస్టులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News