అల్లు అర్జున్ పై కమలం కటాక్ష వీక్షణాలు

సినీ హీరోల మీద రాజకీయ పార్టీలకు ఎపుడూ ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయి. ఎందుకంటే వారు క్రౌడ్ పుల్లర్స్. అందుకే వారి సహాయాని తీసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా దక్షిణాదిన తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానం ప్రత్యేకమైనది.

Update: 2024-12-22 07:59 GMT

సినీ హీరోల మీద రాజకీయ పార్టీలకు ఎపుడూ ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయి. ఎందుకంటే వారు క్రౌడ్ పుల్లర్స్. అందుకే వారి సహాయాని తీసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా దక్షిణాదిన తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానం ప్రత్యేకమైనది. చొక్కాలు చింపుకోవడమే కాదు, ప్రాణాలను సైతం ఇచ్చేసేటంత అభిమానం ఉంటుంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుని ఇబ్బందుల పాలు అవుతున్నారు. ఆయన మీద ఏ 11 అంటూ కేసు కట్టి పోలీసులు ఒక రాత్రి జైలుకు పంపించారు. ప్రస్తుతం బెయిల్ మీద ఆయన ఉన్నారు. నెమ్మదిగా ఈ కేసు తేలిక అవుతుందని అంతా అనుకుంటే మరింత బిర్ర బిగుసుకుంటోంది. అంతే కాదు ఏకంగా తెలంగాణా ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఎంతటి సీరియస్ గా ఉందో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా స్పష్టం చెబుతోంది.

మరో వైపు ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టు దాకా తెలంగాణా పోలీసులు వెళ్లారు. ఇవన్నీ ఒక వైపు ఉంటే అల్లు అర్జున్ తప్పు ఈ విషయంలో ఎంత అన్నది కూడా చర్చ సాగుతోంది. ఆయన హీరోగా ధియేటర్ కి వెళ్ళి సినిమా చూడడం తప్పు కాదు కానీ హెవీ క్రౌడ్ ఉన్నపుడు వెళ్ళడం తప్పే అని అంటున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ కేసు విషయంలో ఏ 11 గా ఉన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారూ ఉన్నారు.

మరో వైపు ఇదే కేసు విషయంలో రాజకీయ పార్టీలు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉండే విపక్షం ప్రభుత్వానిదే తప్పు అంటోంది. బీఆర్ఎస్ అయితే జనాలను కంట్రోల్ చేయలేకపోయారు అని ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఇక తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ని తప్పు పట్టారు.

కేంద్ర బీజేపీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వంటి వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఆ ఘటన బాధ్యత అని అల్లు అర్జుని అరెస్ట్ చేయడం తప్పే అన్నారు. ఇక ఏపీలో వైసీపీ అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిచింది. ఏపీ బీజేపీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తప్పు అంటోంది. ఈ విషయంలో ఇప్పటికి రెండు సార్లు దగ్గుబాటి పురంధేశ్వరి తెలంగాణా ప్రభుత్వం తీరుని తప్పు పట్టారు. తాజాగా ఆమె మాట్లాడుతూ ఏ 11గా ఉన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతో ఉత్సాహం ఏంటని ప్రశ్నించారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసి విచారించకుండా ఆయన ఒక్కరినే ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు.

అది యాధృచ్చికంగా జరిగిన ఘటన తప్ప అందులో హీరో అర్జున్ తప్పు లేదని ఆమె అంటున్నారు. ఒక హీరోగా అల్లు అర్జున్ ఆ థియేటర్ కి వెళ్ళారని చెబుతున్నారు. ఆయన ఏదో కావాలని తొక్కిసలాటకు కారణం అయినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్రీకరిస్తోందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు

ఈ విధంగా చూస్తే అల్లు అర్జున్ కి కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ మద్దతు నిండుగా దక్కుతోంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం తర్వాత ఏ రాజకీయ పార్టీ అల్లు అర్జున్ ని సమర్థించేందుకు ఇప్పటిదాకా ముందుకు రాలేదు. ఈ నేపధ్యంలో ఏపీ నుంచి చిన్నమ్మ సపోర్ట్ చేయడం పట్ల చర్చ సాగుతోంది.

మరో వైపు పుష్ప వన్ టూ ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సాఫ్ట్ కార్నర్ తో ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఆయన జాతీయ కధానాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఈ నేపధ్యంలో బీజేపీ కరుణ కటాక్ష వీక్షణాలు ఆయన మీద కురిపించడం మీద అయితే రాజకీయంగా కొత్త చర్చకు దారి తీస్తోంది.

Tags:    

Similar News