ఢిల్లీలో ఆప్ సోపాలు... బీజేపీకి వరాలు ?
దాంతో ఆప్ లో తలెత్తిన సంక్షోభం నుంచి బీజేపీ రాజకీయ లాభం పొందే చాన్స్ ఉందా అన్న చర్చ సాగుతోంది.
ఢిల్లీలో 2013 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకూ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఆప్ కి ఇపుడు గడ్డు రోజులు నడుస్తున్నాయా అన్న చర్చ ఉంది. ఎందుకు అంటే ఆప్ పార్టీకి సర్వం సహా అయిన అధినేత మాజీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాం విషయంలో సుదీర్ఘ కాలం జైల్ లో ఉన్నారు. ఆయన ఆ తరువాత తన సీఎం పదవికి రాజీనామా చేసి అతిషికి బాధ్యతలు అప్పగించారు.
ఇక 2025 మొదట్లో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో ఆప్ లో రాజకీయ కుదుపులు సంభవిస్తున్నాయి. ఆ పార్టీ ముఖ్యమంత్రిగా అతిషిని నియమించడం పట్ల చాలా మంది సీనియర్లు విభేదిస్తున్నారు. అంతే కాదు వారు ఆప్ ఇటీవల కాలంలో పోతున్న పోకడల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆప్ ఇపుడు భారీ ఎత్తున యాంటీ ఇంకెంబెన్సీని ఎదుర్కొంటోందని కొందరు ఆప్ నేతలు భావిస్తున్నారు. దాంతో వారు ఇదే సందు అని పార్టీని వీడిపోతున్నారు. అలా చూసుకుంటే కనుక ఆప్ ప్రభుత్వంలో కీలక మంత్రి, సీనియర్ నేత కైలాష్ గెహ్లాట్ ఆదివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. అందులో ఆయన చాలా విషయాలనే ప్రస్తావించారు. ఆప్ పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని ఈ సీనియర్ మంత్రి ఆరోపించడం విశేషం.
అంతే కాదు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఆయన తన లేఖలో సూటిగానే చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం ఆప్ ప్రభుత్వంలో హోం, రవాణా, ఐటి, మహిళలు, శిశుసంక్షేమ శాఖలతో పాటు కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఆయన ఆప్ ని విమర్శించడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఎన్నికలు ముందున్న వేళ ఒక సీనియర్ మంత్రి ఆప్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉందని చెప్పడం దేనికి సంకేతం అని అంటున్నారు. అంతే కాదు ప్రజల నాడిని ఆయన అంచనా కట్టి ఈ విధంగా చెప్పారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
ఇదిలా ఉంటే కైలాష్ గెహ్లాట్ బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాంతో ఆప్ లో తలెత్తిన సంక్షోభం నుంచి బీజేపీ రాజకీయ లాభం పొందే చాన్స్ ఉందా అన్న చర్చ సాగుతోంది. బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠం కొట్టాలని చూస్తోంది. 1998లో బీజేపీ ఢిల్లీ పాలనను వదిలేసింది. బీజేపీకి ఢిల్లీ పగ్గాలు దక్కి 26 ఏళ్ళు అవుతోంది అని అంటున్నారు.
మరీ ముఖ్యంగా చూస్తే నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాక అనేక రాష్ట్రాలను గెలుచుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలు సైతం బీజేపీ ఖాతాలో పడ్డాయి. కానీ తాను ఉన్న ఢిల్లీని మాత్రం బీజేపీ లిస్ట్ లోకి చేర్చలేకపోయారు అని అంటున్నారు దాంతో ఈసారి సవాల్ గా బీజేపీ తీసుకుందని అందుకే చాలా వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి ఈసారి ఎన్నికలు అంత సులువు కావని అంటున్నారు. ఏకంగా సుదీర్ఘ కాలం పాలన చేయడంతో సహజంగానే ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక పార్టీలో కూడా కొంత అలజడి ఉంది. వీటిని సరిచేసుకుని బీజేపీని ఢీ కొట్టడం అంటే కష్టమే అని అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే కేజ్రీవాల్ గతంలో ఎపుడూ రాని తిరుమలకు కూడా దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు అని అంటున్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కాం తరువాత ఆప్ పార్టీ డీలా పడింది. ఇక కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తప్పుకోవడంతో కూడా కొంత నిరాశ పూరిత వాతావరణం కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే బీజేపీ ఈసారి ఢిల్లీ పీఠాన్ని పట్టేయాలని కసిగానే పోరాడుతోంది అని అంటున్నారు.